Kalyanadurgam News : కళ్యాణదుర్గంలో చిన్నారి మృతిపై ట్విట్టర్ పోస్టు - చంద్రబాబు, లోకేశ్ పై కేసు నమోదు
Kalyanadurgam News : కళ్యాణదుర్గంలో చిన్నారి మృతి ఘటనపై ట్విట్టర్లో దుష్ప్రచారం చేశారని చంద్రబాబు, లోకేశ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ కన్వీనర్ ఫిర్యాదుతో పోలీసు కేసు రిజిస్టర్ చేశారు.
Kalyanadurgam News : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిన్నారి మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారని కేసు నమోదు అయింది. కళ్యాణదుర్గం రూరల్ మండల వైసీపీ కన్వీనర్ కొంగర భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణదుర్గం టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. 153a r/w 34 IPC సెక్షన్ల ప్రకారం చంద్రబాబు, లోకేశ్ పై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ కాపీతో స్పష్టమైంది.
చంద్రబాబు, లోకేశ్ పై కేసు
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో మంత్రి కె.వి.ఉషా శ్రీ చరణ్ కు వ్యతిరేకంగా ఈ వీడియో పోస్టు చేశారని ఫిర్యాదుదారుడు తెలిపారు. ట్విట్టర్ ద్వారా అసత్య ప్రచారం, ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, ప్రజల్లో శత్రుత్వాన్ని ప్రోత్సహించేలా దుష్ప్రచారం చేసిన కారణంగా ఇరువురిపై కేసు నమోదు చేయాలని కొంగర భాస్కర్ ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియో పోస్టు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో మరణించి దళిత బాలికకు సంబంధించి బహిరంగంగా దుష్ప్రచారం చేసే ప్రకటనలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారన్నారు. ఈ ఫిర్యాదుతో కళ్యాణదుర్గం టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు పెట్టడంపై స్పందించిన లోకేశ్
తనపై కేసు నమోదు చేయడంపై నారా లోకేశ్ స్పందించారు. "ఇంత పిరికివాడివేంటి జగన్ రెడ్డి? ప్రశ్నిస్తే కేసు పెడతానంటే ప్రశ్నిస్తూనే ఉంటా. హత్యాయత్నంతో పాటు 11 కేసులు పెట్టావు. ఇప్పుడు కళ్యాణదుర్గంలో మరో కేసు. నీలా ప్రజల సొమ్ము దొబ్బినందుకు నా పై కేసులు లేవు. ప్రజల పక్షాన నిలబడినందుకు మాత్రమే నాపై కేసులు ఉన్నాయి. మంత్రి పర్యటన సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసి దళిత చిన్నారిని బలిగొన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగిన నాపై కేసు పెట్టారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడినందుకు 12 కేసులు పెట్టావు. నెక్స్ట్ ఏంటి? రౌడీ షీట్ ఓపెన్ చేస్తావా? దేనికైనా రెడీ." అని లోకేశ్ అన్నారు.
ఎస్పీ వివరణ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి ఉష శ్రీ చరణ్ పర్యటన సమయంలో చిన్నారి మృతి ఘటనపై ఎస్పీ ఫకీరప్ప వివరణ ఇచ్చారు. చిన్నారి మరణించడం వెనుక పోలీసుల వైఫల్యం లేదన్నారు. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని జిల్లా ఎస్పీ ప్రదర్శించారు. ట్రాఫిక్ పేరుతో పోలీసులు ఆపేశారని దుష్ర్పచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. కళ్యాణదుర్గంలో శుక్రవారం రాత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్ కాన్వాయ్ వచ్చిన సందర్భంగా పోలీసులు వాహనాల రాకపోకలు ఆపడం వల్ల 8 నెలల చిన్నారి మరణించినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.