Kadiyapu Lanka News: కడియపులంకలో వీడిన మహిళ మర్డర్ మిస్టరీ- అత్యాచారం చేసిన చంపేసిన నిందితుల అరెస్టు
Crime News: కడియపులంకలో గత నెల 15న అదృశ్యమైన వివాహిత కేసు మిస్టరీ వీడింది. ఆమెను వెంటాడి గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
East Godavari Crime News: వేలాది రకాల ఫలపుష్ప వనాలతో ఆహ్లాదంగా కనిపించే కడియపులంకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని పనికి వెళ్లి తిరిగి వస్తున్న ఒంటరి మహిళ పట్ల కిరాతకంగా వ్యవహరించిన ముఠా దురాగతం ఇది. వివాహితను అదను చూసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసి ఆపై చంపి పంటకాలువలో పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులను సైతం విస్మయానికి గురి చేసిన కేసు ఇది. ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన నలుగురు మానవ మృగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కడియపులంక బుర్రిలంక ప్రాంతానికి చెందిన రౌతు కస్తూరి(44) గత నెల 15న కూలి పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. రాత్రి వరకు చూసిన భర్త పాపారావు... ఆమె పని చేసే ప్రాంతానికి వెళ్లి ఆరా తీశాడు. ఆమె పని ముగించుకొని వెళ్లిపోయిందని చెప్పారు. ఎందర్ని అడిగినా ఫలితం లేకపోయింది.
ఏదో జరిగిందని అనుమానపడ్డ భర్త పాపారావు... తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంతలో ఈనెల 17న చొప్పెల్ల లాకుల వద్ద పంటకాలువలో ఓ మృతదేహం లభ్యమైంది. అప్పటి వరకు నమోదు అయిన అదృశ్యం కేసులు పరిశీలించి పోలీసులు ఆ డెడ్‌బాడీ కస్తూరిదిగా గుర్తించారు. భర్త పాపారావును పిలిచి నిర్దారించుకున్నారు. ఆయనకు కూడా అది తన భార్యదిగానే చెప్పారు.
మృతదేహం కస్తూరిదేనని నిర్దారించుకున్న పోలీసులు పోస్టుమార్టం చేశారు. పోస్ట్‌మార్టం నివేదికలో భయంకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. దీంతో కేసు మరో మలుపు తిరిగింది. మరింత లోతుగా దర్యాప్తును ప్రారంభించారు పోలీసులు. వివాహిత కస్తూరిని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని, అంతే కాదు మద్యం మత్తులో ఆమెను చిత్ర హింసలకు గురిచేశారని వైద్యులు చెప్పడంతో నిందితుల కోసం వేట ప్రారంభించారు.
నలుగురు గ్యాంగ్ రేప్ చేసి చంపి..
మహిళ అదృశ్యమైన కడియపులంక నర్సరీ ప్రాంతంలో పరిసరాలలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకు నిందితుల గుట్టు తెలిసింది. కూలి పనికి వెళ్లి తిరిగి వస్తుండగా పలు దృశ్యాలు సిసి పుటేజీల్లో లభించాయి. పోలీసులు లోతుగా పరిశీలించి ఆ ప్రాంతంలో పని చేసే నలుగురు యువకులను పట్టుకుని తమదైన శైలిలో విచారిస్తే అసల విషయం చెప్పారు. ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు రాజమహేంద్రవరం సౌత్‌జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు.
ఒంటరిగా వస్తున్న వివాహితను లాక్కెళ్లి..
ఎప్పటి మాదిరిగానే నర్సరీ పనులకు వెళ్లి ఒంటరి వస్తున్న కస్తూరిని వెంబడించిన బుర్రిలంకకు చెందిన దేవర యేసు, వెలుబుడి ప్రవీణ్, లోకి జయ ప్రసాద్, పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి సురేష్ నిర్మానుష్యంగా ఉన్న చోటకు లాక్కెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో నిందితులు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నారని, బలత్కారం చేసే సమయంలో మృతురాలి మెడ విరిగి మృతి చెందిందని రిపోర్టులో తేలిందన్నారు. కస్తూరి మృతి చెందిందని నిర్ధారించుకున్న నలుగురు మృతదేహాన్ని పంటకాలువలో పడేశారన్నారు.
నిందితులను అరెస్టు చేయడంతోపాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఆ నలుగురిపై రౌడీ షీట్స్ తెరిచినట్లు డిఎస్పి భవ్య కిషోర్ వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు నర్సరీ రైతులు కోరుతున్నారు. గంజాయి, మద్యం, పేకాట వంటి జూదం మత్తులో యువత పెడదోవ పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
Also Read: ఏపీలో దారుణాలు - 2 కుటుంబాల ఘర్షణ, కత్తులతో దాడిలో ముగ్గురు మృతి