Jaipur: పట్టాగొలుసుల కోసం మహిళ కాళ్లు నరికేశారు, జైపూర్‌లో దారుణం
Jaipur Robbers: జైపూర్‌లో ఓ ఇంట్లోకి చొరబడి మహిళల కాళ్లు నరికేసి పట్టాగొలుసులు చోరీ చేశారు దుండగులు
Jaipur Robbers:
ఇంట్లోకి చొరబడి..
పట్టాగొలుసుల కోసం ఓ మహిళ కాళ్లు నరికేశారు దుండగులు. ఈ దారుణం జైపూర్‌లో జరిగింది. మీనా కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు ఈ దారుణానికి ఒడిగట్టారు. మహిళను బాత్‌రూమ్‌లోకి లాక్కెళ్లి, అక్కడే కాళ్లు నరికేశారు. పట్టీలు తీసుకుని పారిపోయారని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు చెప్పారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆమె మెడకు కూడా గాయాలైనట్టు గుర్తించారు. "బాత్‌రూమ్‌లో దారుణ స్థితిలో పడి ఉందని మా ఇంట్లో వాళ్లు చెప్పారు. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తీసుకొచ్చాం" అని బాధితురాలు కుటుంబ సభ్యులు తెలిపారు. గల్టా గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ విచారణ కొనసాగుతోంది. తదుపరి విచారణ చేపట్టి...నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు.
Jaipur, Rajasthan | Weapons used in the crime along with chopped-off parts of legs have been recovered. Her treatment is underway: ASP, Galta PS, Jaipur pic.twitter.com/sQA50161pD
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 9, 2022
Jaipur, Rajasthan | My daughter called & told me about my mother lying injured with chopped-off parts of her legs near a drain. She was immediately rushed to the hospital: Gangadevi, victim's daughter pic.twitter.com/sPIV7OjUyp
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 9, 2022
చైన్‌స్నాచింగ్‌లు..
ఇలాంటి చోరీ కేసులు ఈ మధ్య కాలంలో అన్నిచోట్లా ఎక్కువవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహిళలు అని లేదు, ముసలివాళ్లు అని లేదు. బంగారం దొరికితే చాలన్నట్లు చేస్తున్నారు చైన్ స్నాచింగ్ దొంగలు. బంగారం ఒంటి మీద పెట్టుకుని రావాలంటేనే ఆడవాళ్లు భయపడిపోతున్నారు. ఎట్నుంచి ఎవరు బైక్ మీద వచ్చి దోచుకెళ్లిపోతారో అని వణికిపోతున్నారు. ఇంటి బయట ముగ్గు వేయాలన్నా, పని చేసుకోవాలన్నా మహిళలు ఆలోచిస్తున్నారు. ఆ విధంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా నాగారం మున్సిపాలిటీ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఇంటిబయట పని చేసుకుంటున్న హైమావతి (55) అనే మహిళ మెడలో ఉన్న 5 తులాల పుస్తెల తాడును దుండగుడు దొంగిలించాడు. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలు మహిళలను బెంబేలెత్తిస్తున్నాయి. దీనిపై దృష్టి పెట్టిన పోలీసు ఉన్నతాధికారులు జంక్షన్స్ వద్ద ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను కూడా అమర్చారు. వాటి ద్వారా నిందితులను సులభంగా పట్టుకునే వీలుంటుంది. అయినప్పటికీ కొన్ని కేసులు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. వారిలోనూ 18 నుంచి 35 మధ్య వయసువారే దొంగతనం చేస్తున్నట్లు చెప్పారు. వారిలో ఎక్కువశాతం మంది చదువుకున్న వారేనని.. ఉద్యోగాలు దొరక్క దొంగలుగా మారుతున్నట్లు వివరించారు. అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని అన్నారు. అయితే తరచుగా చోరీలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.