Hakimpet Airport: హకీంపేట ఎయిర్ పోర్టులో ప్రమాదం! తల రెండు ముక్కలై ఆఫీసర్ దుర్మరణం!
Hakeempet Airport News: ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఓ ఎయిర్ క్రాఫ్ట్ క్లీనింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఎజెక్షన్ సీట్ పేలిపోయిందని చెబుతున్నారు.
Hakeempet Airport Accident: హైదరాబాద్ లోని హకీంపేట్ ఎయిర్ పోర్టులో ఓ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ దుర్మరణం పాలయ్యారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఓ ఎయిర్ క్రాఫ్ట్ క్లీనింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఎజెక్షన్ సీట్ పేలిపోయిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన హరివీర్ చౌదరి అనే ఆఫీసర్ తల రెండు ముక్కలై అక్కడికక్కడే చనిపోయాడని అధికారులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోస్టు మార్టం తర్వాత ప్రత్యేక విమానంలో మధురకు తరలించనున్నారు. హరివీర్ చౌదరి మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
హకీంపేట్ ఎయిర్ పోర్టును ప్రయాణికులకు..?
నానాటికీ విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి మరో ఎయిర్ పోర్టు ఉండాలనే ఉద్దేశంతో హకీం పేట ఎయిర్ బేస్ ను పౌరులకు అందుబాటులోకి తీసుకురావాలని గత తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అంతర్జాతీయ స్థాయి విమాన సేవలు అందుతుండగా.. నార్త్ సిటీ కేంద్రంగా రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ సెంటర్‌లో పౌర సేవలు ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రక్షణ శాఖతో సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని అప్పట్లో మంత్రి కేటీఆర్ చెప్పారు.