Kurnool News : పొలం అమ్ముతావా ప్రాణం పోగొట్టుకుంటావా అని ఆప్షన్ ఇచ్చిన సీఐడీ సీఐ - రికార్డు చేసిన రైతు ! వాట్ నెక్ట్స్
కర్నూలు జిల్లాలో పొలం అమ్మాలని రైతును బెదిరిస్తున్న పోలీసుల వ్యవహారం వెలుగు చూసింది. బెదిరిపులను రికార్డు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు రైతు.
Kurnool News : పోలీసులు అంటే రక్షించేవారు కానీ భక్షించేవారిగా మారిపోయిన వారితో డిపార్టుమెంట్‌కే చెడ్డపేరు వస్తుంది. అలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రజలు కూడా భయపడాల్సి వస్తుంది. కర్నూలులో ఓ ఎస్ఐ.. భూమి అమ్మాలని రైతును బెదిరించాడు. భూమి అమ్ముతావా.. చస్తావా అనే ఆప్షన్లను స్టేషన్‌కు పిలిపించి మరీ ఇచ్చాడు. అయితే ఆ రైతు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ భూమి అమ్మకూడదు.. ఆ పోలీసుల గురించి అందరికీ తెలియాలని ఆ బెదిరింపులన్నింటినీ రహస్యంగా రికార్డు చేశారు. ఇప్పుడా కేసు కీలక మలుపు తిరిగింది.
రైతు పొలానికి దారి ఆపేసి.. మిగతా పొలాన్ని అమ్మాలని రైతులపై పోలీసుల వేధింపులు
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం వరిముక్కల గ్రామంలో నివాసం ఉండే వడ్డే హరికృష్ణ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన పొలం ఉంది. వీరి పొలంను ఆనుకుని ఉండే భూమిని సిఐడి సీఐగా పనిచేస్తున్న గొల్ల చిన్న , కౌలుట్ల కానిస్టేబుల్ గొల్ల మునేంద్ర అనే వ్యక్తులు కొనుగోలు చేశారు. పక్క భూమిని కొనుగోలు చేశాం కాబట్టి మీ భూమి కూడా అమ్మేయాలని హరికృష్ణ కుటుంబంపై ఒత్తిడి తెచ్చారు. దాడులు కూడా చేశారు. వారి పొలానికి దారి లేకుండా చేశారు. వేధింపులు, దాడులు పెరిగిపోవడంతో హరికృష్ణ దేవనకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాశారు. దీంతో సిఐడి సీఐ గొల్ల చిన్న కౌలుట్ల కానిస్టేబుల్ గొల్ల మునేంద్ర పై కేసు నమోదు చేశారు.
కేసు పెట్టడంతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మరీ హెచ్చరికలు
అయితే తమపైనే కేసు పెడతారా సీఐడీ సీఐ చిన్నా.. దేవనకొండ ఎస్సై భూపాలుడు సాయంతో 28 వ తేదీన వడ్డే హరికృష్ణ కుటుంబాన్ని మొత్తం స్టేషన్‌కు పిలిపించింది . కేసు రాజీ అవుతావా నీ ప్రాణం పోగొట్టుకుంటావా పోలీసులు హెచ్చరికలు జారీ చేశఆరు. మర్యాదగా నీ భూమి అమ్ముకొని వెళ్ళిపో లేదంటే నీ ప్రాణం పోగొట్టుకుంటావు అని బెదిరించారు. ఎస్ఐ బెదిరింపులను బాధితులు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. పక్కా సాక్ష్యాలతో ఎస్ఐ భూపాలుడిపై పత్తికొండ సిఐ రామకృష్ణా రెడ్డికి ఫిర్యాదుు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సిఐ విచారణ చేపట్టారు. తమను బెదిరిస్తూ, భయబ్రాంతులకు గురి చేస్తున్న ఎస్ఐ భూపాలుడు, సీఐ కౌలుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతు హరికృష్ణ, అతని కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
విచారణ జరుపుతున్న ఉన్నతాధికారులు
వరిముక్కల గ్రామంలో హరికృష్ణకు1.50 ఎకరాల భూమి ఉండగా సిఐ కౌలుట్లకు రెండు ఎకరాల భూమి ఉంది. హరికృష్ణ తన పొలంలోకి వెళ్లాలంటే కౌలుట్ల పొలం మీదుగా వెళ్ళాలి. ఇదే అదునుగా తీసుకొని పొలం అమ్మాలి.. లేదంటే దారి ఇవ్వను అంటూ బెదిరించసాగాడు దీనిపైనే సీఐ కౌలుట్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇలా తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒక సామాన్య రైతును బెదిరించిన ఎస్ఐ, సీఐ పై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వారి బెదిరింపులపై విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఉన్నత అధికారులు ప్రభుత్వ అధికారాలను అడ్డుపెట్టుకొని సామాన్య ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నా వారిని ఉద్యోగాల నుండి తొలగించాలని ఇటువంటి సంఘటనలతో ప్రజలకు భయం కలిగి చేస్తున్నటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.