ఇన్‌స్టాలో పరిచయం, కులాంతర ప్రేమ వివాహం.. కొన్ని నెలల్లోనే ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య
IAS Chinna Ramudu | ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుంది.

తాడేపల్లి: సామాన్యుల్లోనే కాదు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నతాధికారులు సైతం గృహహింస కారణంగా ఎంతో నష్టపోతున్నారు. అత్తింటి వేధింపులతో తాజాగా ఏపీలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె మాధురి సాహితీబాయి (27) పెళ్లైన కొన్ని నెలలకే ఆత్మహత్య చేసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, కులాంతర వివాహం
చిన్న రాముడు ఏపీ ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీగా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారి అయిన చిన్నరాముడు కుమార్తె సాహితీబాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో రాజేష్ నాయుడు అనే యువకుడు పరిచయమయ్యాడు. రాజేష్ నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందినవాడు. పెద్దలను ఎదిరించి మరీ 2025 మార్చిలో రాజేష్ నాయుడు, సాహితీబాయి కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన గదిలోని బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి
పెళ్లయిన మూడో నెల నుంచే భర్త తనను వేధిస్తున్నాడని సాహితీ బాయి తన తల్లిదండ్రులకు తెలిపింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న కుమార్తెను పోలీసుల సహకారంతో రెండు నెలల కిందట కుమార్తెను తాడేపల్లిలోని తమ నివాసానికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి సాహితీబాయి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన బలవన్మరణానికి పాల్పడింది. సమాచాం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. తల్లి లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుమార్తె ఆత్మహత్యపై ఐఏఎస్ చిన్నరాముడు మీడియాతో మాట్లాడారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. రాజేష్ నాయుడుకు ఉద్యోగం ఉందని మోసం చేసి, మహానందిలో నా కుమార్తెను రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో గ్రాండ్‌గా మళ్లీ పెళ్లి చేస్తామని చెప్పి అల్లుడితో అమ్మాయిని పంపినట్లు చెప్పారు. ఆ తర్వాత రాజేష్ అదనపు కట్నం కోసం వేధించడం మొలుపెట్టాడని, 'నీకు నేనే దిక్కు, చెప్పిన మాట వినకపోతే చంపేస్తానని' బెదిరించేవాడని చిన్నారాముడు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఫోన్ చేయాలన్నా భర్త పర్మిసన్ తీసుకోవాల్సి వచ్చేదని.. అక్కడ ఉండలేన చెప్పడంతో రెండు నెలల కిందట కుమార్తెను ఇంటికి తీసుకొచ్చామన్నారు. తన భర్తది నిజమైన ప్రేమ కాదని, డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడని.. అందుకే వచ్చి తనను తీసుకెళ్లడం లేదని బాధపడేది. కానీ ఇలా చేస్తుందని అనుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.






















