Hyderabad Crime : స్నాప్ చాట్ లో చాక్లెట్ డ్రగ్స్ ఆర్డర్స్, సంపన్నుల పిల్లలే టార్గెట్!
Hyderabad Crime : చాక్లెట్స్ రూపంలో డ్రగ్స్ తయారు చేసిన అమ్ముతున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు డ్రగ్స్ తయారు చేసిన విధానం, విక్రయించిన తీరు చూసి పోలీసులు షాక్ తిన్నారు.
Hyderabad Crime : చాక్లెట్స్ రూపంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై సీపీ సీవీ ఆనంద్ మీడియాకు వివరాలు తెలిపారు. చాక్లెట్స్ రూపంలో డ్రగ్స్ విక్రయిస్తున్న రిషి సంజయ్ మెహతా అనే స్టూడెంట్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇతని లిస్టులో సంపన్నుల పిల్లలు ఉన్నారన్నారు. ఈ విషయం వాళ్ల తల్లిదండ్రులకు తెలియజేశామన్నారు. రిషి కాలేజీ డేస్ నుంచి డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని, ముందుగా ఈ సిగరెట్స్ లో డ్రగ్స్ లేయర్ గా పూసి విక్రయించాడని వెల్లడించారు. అది లాభాలు ఇవ్వకపోవడంతో చాక్లెట్స్ రూపంలో డ్రగ్స్ విక్రయాలు మొదలుపెట్టాడని సీపీ తెలిపారు. చాక్లెట్ రూపంలో డ్రగ్స్ ను తానే స్వయంగా తయారు చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు
స్నాప్ చాట్ లో ఆర్డర్స్
"చాక్లెట్ రూపంలో ఉండే డ్రగ్స్ కు డిమాండ్ ఉండడంతో రిషి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. నాలుగు కేజీల ముడి చాక్లెట్ ను కొని 40 గ్రాముల యాష్ ఆయిల్ తో కలిపి డీ ఫ్రిడ్జ్ లో ఉంచి చాక్లెట్ డ్రగ్స్ తయారుచేస్తున్నాడు. ఇలా తయారుచేసిన చాక్లెట్ డ్రగ్స్ ను ఐదు నుంచి 6 వేలకు విక్రయిస్తున్నాడు. చాక్లెట్ బార్ డిమాండ్ ను బట్టి 1000 నుంచి 3000 వరకు విక్రయించాడు. ఒక్క చాక్లెట్ బారు తింటే ఆరు గంటల వరకు మత్తులో ఉండొచ్చు. రిషి తయారు చేసే చాక్లెట్ స్మెల్ పీల్చినా కూడా మత్తు ఎక్కుతుంది. తాను తయారుచేసిన చాక్లెట్ డ్రగ్స్ ను స్నాప్ చాట్ ద్వారా రిషి విక్రయించాడు. ఉబర్ రాపిడో ద్వారా ఆర్డర్లను చేరవేసేవాడు. ప్రస్తుతం రిషి వద్ద వంద మంది కన్ఫ్యూమర్స్ ఉన్నారు. వీరంతా 18 నుంచి 25 సంవత్సరాల వయసు గలవారు. రిషి తల్లిదండ్రులు ఫార్మా కంపెనీని రన్ చేస్తున్నారు. ఈ విషయం విని వారు కూడా షాక్ లో ఉన్నారు."- సీపీ సీవీ ఆనంద్
60 శాతం అమ్మాయిలే
పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు. రిషి వద్ద చాక్లెట్స్ కొనుగోలు చేసేవారిలో 60 శాతం అమ్మాయిలే ఉన్నారని తెలిపారు. చాక్లెట్ డ్రగ్స్ తయారు చేయడానికి యాష్ ఆయిల్ ను వైజాగ్ నుంచి తెప్పించాడని చెప్పారు. వైజాగ్ లో రామారావు అనే వ్యక్తి వద్ద యాష్ ఆయిల్ కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. రామారావు పరారీలో ఉన్నాడని, శ్రీకాంత్ యాదవ్ రోహిత్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా యాష్ ఆయిల్ సప్లై చేశారని సీపీ ఆనంద్ తెలిపారు.
డ్రగ్స్ డీలర్ ఎడ్విన్ అరెస్టు
మాదకద్రవ్యాల సరఫరా కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్ అరెస్టయ్యాడు. గత మూడు నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్న డ్రగ్ సప్లయర్ ఎడ్విన్‌ను నార్కోటిక్ విభాగం పోలీసులు గోవాలో పట్టుకున్నారు. గోవా నుంచి తెలంగాణలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఎడ్విన్‌పై ఆరోపణలున్నాయి. మాదకద్రవ్యాల కేసు దర్యాప్తులో భాగంగా నార్కోటిక్స్ పోలీసులు ఎడ్విన్ ను గోవాలో అరెస్ట్ చేశారు. గోవా నుంచి తెలంగాణకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు నార్కోటిక్ విభాగం పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు మూడు నెలల కిందట నారాయణ బోర్కర్ ను అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కొన్ని రోజులపాటు నిఘా ఉంచి మాదకద్రవ్యాల సరఫరా కేసులో కీలక సూత్రధారి అయిన ఎడ్విన్ ను గోవాలో అరెస్ట్ చేశారు. దాదాపు రెండు నుంచి నాలుగు వారాలుగా నార్కోటిక్ విభాగం పోలీసులు గోవాలో ఎడ్విన్ కోసం వెతుకుతున్నారు. శనివారం నాడు నార్కోటిక్ విభాగం పోలీసులు ఎడ్విన్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. నేటి రాత్రి ఎడ్విన్ ను హైదరాబాద్‌కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.