Ration Rice: ప్రభుత్వ బియ్యాన్ని ప్రభుత్వానికే అమ్మేస్తున్న ముఠా, చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అమ్మేస్తోందో ముఠా. రేషన్ బియ్యాన్ని ప్రజల నుంచి కొనుగోలు చేసి ప్రభుత్వానికి సరఫరా చేసే కంట్రాక్టర్ కు అమ్మేస్తున్నారు.
ప్రభుత్వం నిరుపేదల కోసం అందించే రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద నుంచి తక్కువ ధరకు కోనుగోలు చేసి తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికే అమ్మేస్తున్న ఘరానా ముఠాను సికింద్రాబాద్ తుకారం గేట్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని(Ration Rice) కొనుగోలు చేసి సంగారెడ్డి జిల్లా పాశమైలరంలోని ఓ గోదాంలో భద్రపరుస్తున్నారు. తుకారం గేట్ పోలీస్టేషన్ పరిధిలో నిఘా పెట్టిన పోలీసులు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ఆరెస్ట్ చేశారు. తీగ లాగితే డొంక కదలినట్లు పోలీసు విచారణలో ప్రభుత్వం ప్రజలకు చౌకదుకాణాల(PDS Shops) ద్వారా ఇస్తున్న బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికే అమ్మేస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠాలో మణిక్యం, శంకర్ అనే వ్యక్తులు ప్రజల వద్ద కేజీ రూ.10 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై, పోలీసులు సంయుక్త ఆపరేషన్
ప్రజల వద్ద కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఓ గోదాంలో భద్రపరుస్తున్నారు. తర్వాత రైస్ మిల్లర్ల సాయంతో ప్రభుత్వానికి బియ్యం సరఫరా చేస్తున్న గుజారాత్ కు చెందిన కాంట్రాక్టర్ శర్మకు ఈ బియ్యాన్ని చేరవేస్తున్నారు. అక్కడి నుంచి తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి(State Govt) బియ్యం అమ్మేస్తున్నారు. ఈ చైన్ సిస్టమ్ పై టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై, తుకారం గేట్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేశారు. ఈ ముఠాలో మొత్తం 16 మంది నిందితులతో పాటు 410 క్వింటాళ్ల బియ్యం, ఆరు వాహనాలను స్వాధీనం చేసుకోన్నారు. తుకారం గేట్, సంగారెడ్డి, సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో స్థావరాలపై దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యం అమ్మకం, కోనుగోలు నేరమాని అలా చేస్తే రేషన్ లబ్ధిదారుడి కార్డుపై సేవలు నిలిపివేయడంతో పాటు కేసులు పెడతామని సివిల్ సప్లై(Civil Supply) అధికారులు హెచ్చరించారు.
రూ.6 లక్షల విలువైన రేషన్ బియ్యం పట్టివేత
సంగారెడ్డి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జహీరాబాద్ మీదుగా హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనాల తనిఖీల్లో 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చిరాగ్ పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యం విలువ రూ. 6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: సెల్ఫ్ డ్రైవ్ కార్లను రెంట్‌కు తీసుకుంటారు - అమ్మేస్తారు ! వాళ్ల బిజినెస్ ఇదే