Car Thieves : సెల్ఫ్ డ్రైవ్ కార్లను రెంట్‌కు తీసుకుంటారు - అమ్మేస్తారు ! వాళ్ల బిజినెస్ ఇదే
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అద్దెకు తీసుకుని అమ్మేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జీపీఎస్ తొలగించి పక్క రాష్ట్రాల్లో కార్లను అమ్మేస్తున్నారు.
మెట్రో నగరాల్లో సెల్ఫ్ డ్రైవ్ కార్లకు ( Self Drive Cars ) మంచి డిమాండ్ ఉంది. యాప్‌ల ద్వారా కార్లను బుక్ చేసుకుని సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగి అప్పగించొచ్చు. ఇలా అందరూ ఆ కార్ల సేవలను ఉపయోగించుకుంటారు కానీ కొంతమంది మాత్రం మళ్లీ మన చేతికొచ్చేసిందిగా మళ్లీ ఎందుకివ్వడం అని తస్కరించేస్తారు. అలాంటి గ్యాంగ్‌ను ఒకదాన్ని రాచకొండ పోలీసులు ( Racha konda Police ) పట్టుకున్నారు. వారు కార్లను తస్కరించిన వైనం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. కార్ రెంటల్స్ యజమానులు ఇక మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన గుడ్డటి మహేష్ నూతన్ కుమార్ 2016లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం చేయడం ఇష్టం లేదో .. రాలేదో కానీ దొంగతనాలు ప్రారంభించాడు. మొదట మొబైల్ దొంగతనం చేశాడు. కానీ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత అప్ డేట్ అయ్యాడు. మొబైల్స్ కాదు తాను చదువుకున్న చదువును ఉపయోగించి దొంగతనాలు చేయాలని డిసైడయ్యారు. హైదరాబాద్ వచ్చి జూమ్ కార్ ( Zoom Cars ) బుక్ చేసుకుని సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లిపోయాడు. కొంత దూరం వెళ్లాక తన ఇంజినీరింగ్ తెలివి తేటలతో జీపీఎస్ తొలగించేసి పక్క రాష్ట్రానికి తరలించి అమ్మేసుకున్నాడు.
అక్కడ్నుంచి ప్రారంభించాడు. ఎక్కడా తగ్గలేదు. అనేక చోట్ల పదహారు కేసులు నమోదయ్యాయి. కొన్ని చోట్ల అరెసయ్యాడు. కానీ బెయిల్‌పై విడుదలైన వెంటనే మళ్ళీ అదే పని చేసేవాడు. జైల్లో పరిచయస్తులతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని తర్వాత బైకుల దొంగతనం కూడా ప్రారంభించాడు. దొంగతనం చేసిన వాహనాల ను మార్కెట్ లో ఎంత వస్తే అంతకు అమ్మేసి జల్సాలు చేసుకుంటున్నాడు. గత అక్టోబర్‌లో చైతన్యపురిలో ఇలా ఓ కేసు నమోదయింది. పోలీసులు సీరియస్‌గా పరిశోధన చేసి సీసీ కెమెరాల సాయంతో ట్రేస్ చేయడంతో దొంగ దొరికిపోయాడు. జీపీఎస్ తొలగించి తరలించిన విషయం గుట్టు రట్టవడంతో పట్టుకున్నారు. నూతన్ గ్యాంగ్‌లో మొత్తం ముగ్గురు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
నూతన్ దొంగతనాలు ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. ప్రధానమైన మెట్రో నగరాల్లో కూడా ఉన్నాయి. ముంబై, భువనేశ్వర్, చైన్నై, పూణేలలో కార్లను పోలీసులు గుర్తించారు. నిందితుల్ని అరెస్ట్ చేసి 5 కార్లు, ఒక బైక్,స్వాధీనం చేసుకున్నారు. కార్లను అద్దెకు ఇచ్చే వారు మరింత టెక్నాలజీని పెంపొందించుకోవాలని రాచకొండ పోలీసులు సలహా ఇస్తున్నారు. దొంగల కన్నా అపే డేట్‌గా ఉండాలని అంటున్నారు.