Hyderabad News: కొంపముంచిన క్రిప్టో కరెన్సీ - 27 లక్షల రూపాయలు స్వాహా!
Hyderabad News: తక్కువ సమయంలో కోటీశ్వరుడు కావాలని క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడుతూ పోయాడు. కాస్త లాభం కనిపించే సరికి 27 లక్షల వరకూ పెట్టి నేరగాళ్ల చేతిలో మోసపోయాడు.
Hyderabad News: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టి కోటీశ్వరుడు అవ్వాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ముందు పది వేలు పెట్టాడు. దానికి లాభాలు కనిపించాయి. అయితే వాటిని తీసుకోలేదు. అయినా లాభం వస్తుంది కదా అని మళ్లీ 20 వేలు పెట్టాడు. ఆ తర్వాత 80 వేలు పెట్టాడు. లాభాలు చూపిస్తూనే ఉన్నాయి. కానీ తీసుకోవడానికి రావట్లేదు. లాభాలు ఎక్కువగా వస్తున్నాయనే ఆశతో పట్టువదలని విక్రమార్కుడిలా లక్షలకు లక్షలు పెడుతూ పోయాడు. తీరా మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడో వ్యక్తి.
ఖాతాను ఫ్రీజ్ చేసిన సైబర్ నేరగాళ్లు..
హైదరాబాద్ గాంధీ నగర్ కు చెందిన శ్రీనివాస్ ఫోన్ నెంబర్ ను గుర్తు తెలియని వ్యక్తులు టెలిగ్రామ్ గ్రూపులో యాడ్ చేశారు. తాము చెప్పినట్లు చేస్తే తక్కువ సమయంలోనే కోటీశ్వరులు కావొచ్చంటూ వల విసిరారు. ఏం చేయాలంటూ అడిగిన పాపానికి శ్రీనివాస్ ను నిండా ముంచేశారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడ్తే.. చాలా లాభాలు వస్తాయని, తక్కువ సమయంలోనే కోటీశ్వరులు అవ్వొచని చెప్పారు. దీంతో 10, 20, 80 వేలు పెట్టుకుంటూ పోయాడు శ్రీనివాస్. ఆ తర్వాత ఒకేసారి 2 లక్షల 50 వేలు పెట్టాడు. దీనికి లాభాలు కనిపించాయి. తీసుకునేందుకు వీలు లేకుండా డబ్బును సైబర్ నేరగాళ్లు ఫ్రీజ్ చేశారు. లాభాలు వస్తున్నాయి కదా అని అత్యాశకు పోయి పలు దఫాలుగా 27 లక్షల రూపాయలను పెట్టాడు.
అయితే అందులోంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేందుకు రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఏం చేయాలో పాలుపోక వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ ను కలిసి జరిగిన విషయమంతా వివరించాడు. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెట్టుబడుల పేరుతో మోసాలు.. జాగ్రత్త సుమీ..
పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. మొదట వాట్సాప్, ఫేస్ బుక్, టెక్స్ట్ మెసేజెస్ చేస్తూ.. అమాయకులు ఆకర్షితులయ్యేలా చేస్తారు. పార్ట్ టైం జాబ్స్ పేరిట ఇంట్లో కూర్చుని రోజుకి 10,000 నుంచి 25,000 వేల వరకూ సంపాదించడంటూ మెస్సేజెస్ చేస్తారు. ఒక్కసారి మనం ఆ లింక్ ను క్లిక్ చేసినా, అందులో ఉన్న నెంబర్ కి ఫోన్ చేసినా ఇక మన పని అయిపపోనట్టే. అలా రోజుకి హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు దాదాపు 20 నుంచి 30 వరకు కేసులు వస్తున్నాయంటే మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే లక్ష రూపాయలు దాటితేనే ఫిర్యాదు చేసేందుకు బాధితులు సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు వస్తున్నారు. లక్షకు తక్కువ జరిగిన ఫిర్యాదులు స్థానిక పోలీస్ స్టేషన్ లోనే నమోదవుతాయి. దీని బట్టి రోజుకి కనీసం వందల్లో ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. చిన్న మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న వారు పరువు కోసమో లేదా కొంత డబ్బే కదా అని ఫిర్యాదు కూడా చేయడం లేదు.