Naveen Murder Case : పోలీస్ కస్టడీకి హరిహరకృష్ణ, ఆ వారం రోజులు ఏంచేశాడో విచారణ!
Naveen Murder Case : హైదరాబాద్ లో సంచలనమైన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
Naveen Murder Case : అబ్దుల్లాపూర్ మెట్ లో నవీన్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. హరిహరకృష్ణను చర్లపల్లి జైలు నుంచి ఎల్బీనగర్ ఎస్ఓటీ ఆఫీస్ కు తరలించారు. పోలీసు కస్టడీలో నవీన్ హత్యపై కీలక ఆధారాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తరలించే క్రమంలో నిందితుడు పారిపోకుండా కాళ్లకు బేడీలు వేశారు. అయితే హరిహరకృష్ణలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించడంలేదని అతడిని పరిశీలించిన వాళ్లు అంటున్నారు.
7 రోజుల పాటు పోలీస్ కస్టడీ
అయితే నవీన్ హత్యకేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు 7 రోజులపాటు ప్రశ్నించనున్నారు. నవీన్ హత్య కేసులో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా నిందితుడికి కొందరు సహకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన తర్వాత నిందితుడు ఓ స్నేహితుడి ఇంటికి వెళ్లి బట్టలుమార్చుకోవడం, మరో స్నేహితుడికి ఫోన్ చేసి డ్రగ్స్, గంజాయి గురించి చర్చించడం, నిందితుడు తండ్రి, లవర్ కు విషయం చెప్పినా వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగిన వారం రోజుల తర్వాత పోలీసులకు లొంగిపోయినా హరిహరకృష్ణ.. ఈ వారం రోజుల పాటు ఏంచేశాడు, ఎవరు అతడికి సాయం చేశారు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ కస్టడీలో ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్ కీలకంగా మారింది. నవీన్ హత్యలో స్నేహితుల పాత్ర, లవ్ స్టోరీలో యువతి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
గంజాయి మత్తులో హత్య
రంగారెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్‌లో బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. హరిహరకృష్ణకు వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తన లవర్ తో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడు నవీన్‌ను హరిహరకృష్ణ అత్యంత హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన నిందితుడు హరిహరకృష్ణను చర్లపల్లి సెంట్రల్ జైలును ఎల్బీనగర్ ఎస్ఓటీ ఆఫీస్ కు తరలించారు. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు నిందితుడి కస్టడీ కోరారు. ఈ మేరకు పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ చేశారు. పోలీసుల తరఫున అదనపు పీపీ ప్రతాప్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపిస్తూ ... హరిహర కృష్ణను 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే కోర్టు వారం రోజుల కస్టడీకి అనుమతించింది. హరిహర కృష్ణ పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత, ఆధారాలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ తొందరగా ముగిసేలా చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ కేసు విచారణలో యువతి నిహారిక సహకరించడంలేదని పోలీసులు అంటున్నారు. మద్యం, గంజాయి మత్తులో నవీన్ ను హత్య చేసి, శరీర భాగాలు కోశాడని హరిహరకృష్ణ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. నవీన్ హత్య జరిగిన ఘటనా స్థలాన్ని నిందితుడితో కలిసి పరిశీలించాల్సి ఉందని పిటిషన్ లో పోలీసులు తెలిపారు. అలాగే ఈ హత్య వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. నవీన్ ఫోన్ పగలగొట్టిన హరిహర కృష్ణ దాన్ని ఔటర్ రింగ్ రోడ్డు పక్కన పడేశాడని, అది ఎక్కడో తెలుసుకోవాల్సి ఉందన్నారు పోలీసులు. నిందితుడు హరిహర కృష్ణ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పిటిషన్ లో పోలీసులు తెలిపారు. ఫోన్‌ను ఎక్కడ దాచాడనే విషయాన్ని హరిహర కృష్ణను విచారించాల్సి ఉందన్నారు.