(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad News : మేడ్చల్ జిల్లాలో విషాదం, చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి
Hyderabad News : మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి చెందారు.
Hyderabad News : మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని జవహార్‌నగర్ పరిధిలో ఉన్న మల్కారంలో ఉన్న చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మదర్సా పాఠశాలలో చదివే విద్యార్థులను పిక్నిక్ పేరిట ఉపాధ్యాయుడు బయటికి తీసుకెళ్లారు. దగ్గర్లోని ఎర్రగుంట చెరువులో ఈత కొట్టడానికి విద్యార్థులు దిగారు. అయితే చెరువు లోతుగా విద్యార్థులు మునిగిపోయయారు. వారిని రక్షించడానికి ఉపాధ్యాయుడు కూడా చెరువులో దిగారు. పిల్లలంతా ఉపాధ్యాయుడ్ని పట్టుకోవడంతో బయటకు రాలేక అందరూ నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థులు 12 నుంచి 14 ఏళ్ల వయసు వారుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాలు వెలికితీత
గజ ఈతగాళ్లతో విద్యార్థులు, ఉపాధ్యాయుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు కాచిగూడలోని నెహ్రూనగర్ కు చెందిన వారుగు పోలీసులు గుర్తించారు. విద్యార్థులు మల్కారంలోని మదర్సాలో శిక్షణా తరగతుల కోసం వచ్చినట్లు తెలుస్తోంది. మృతులు ఇస్మాయిల్, సోహేల్, జాఫర్, అయాన్, రియాన్, ఉపాధ్యాయుడు యోహన్ గా పోలీసులు గుర్తించారు.
ఫొటోలు దిగుతూ నదిలో గల్లంతు
ఇటీవల మంచిర్యాల జిల్లా చెన్నూరులో నదీ తీరాన ఫొటోలు దిగుతూ ఇద్దరు ఉపాధ్యాయలు గల్లంతయ్యారు. కేరళకు చెందిన బిజూ, టోనీ, ఆంటోని చెన్నూరులోని ఓ ప్రైవేటు స్కూల్‌లో వారిద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. సరదాగా గడిపేందుకు గోదావరి నది వద్దకు వెళ్లారు ఉపాధ్యాయులు. అక్కడ చాలా సేపు ఆహ్లాదంగా గడిపిన ఉపాధ్యాయులు ఫోటోలు తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ముగ్గురు టీచర్స్ నదిలో గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు బయటపడ్డారు. మిగతా ఇద్దరు గోదావరిలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారు బిజూ, టోనీగా పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహాం లభ్యం అయింది. నదీ పరివాహాక ప్రాంతాలు, చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈత రాకపోతే నీళ్లల్లోకి వెళ్లొద్దని కోరారు.