Hyderabad: నడిరోడ్డుపై యువకుడి కిరాతక హత్య, కత్తులతో పొడిచి చంపి - హడలిపోయిన జనం
Langar House Murder: పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగిందా లేక ఇంకా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని లంగర్ హౌస్‌లో నడిరోడ్డుపైనే దారుణమైన రీతిలో హత్య జరిగింది. ఒక యువకుడిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రోడ్డుపైనే చంపేశారు. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 96 వద్ద ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. అతణ్ని కత్తులతో పొడుస్తూ అతి కిరాతకంగా చంపేశారు. రాత్రి వేళ నడి రోడ్డు మీద పడి ఉన్న యువకుడి శవాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలాన్ని పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్, అసిఫ్ నగర్ ఏసీపీ శివ మారుతి పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ కొనసాగుతోంది.
పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగిందా లేక ఇంకా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వీళ్లంతా ఒక గ్యాంగ్ గా ఏర్పడి పక్కా స్కెచ్ తో హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చనిపోయిన వ్యక్తిని పోలీసులు చంద్రాయణ గుట్ట సమీపంలోని షాహీన్ నగర్‌కు చెందిన జహంగీర్ అనే 22 ఏళ్ల వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. శవాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
బస్సు డ్రైవర్ ఆత్మహత్య (Yadadri Bus Driver Suicide)
యాదగిరి గుట్ట బస్ డిపోలో విషాదం జరిగింది. బస్సు కింద పడి ఆర్టీసీ డ్రైవర్ మిర్యాల కిషన్ (60) ఆత్మహత్య చేసుకున్నాడు. డిపోలోని బంక్ వద్ద డీజిల్ నింపుకొని వెళ్తున్న బస్ కింద కిషన్ పడిపోయాడు. ఈ నెల చివరలో కిషన్ పదవి విరమణ తీసుకోవాల్సి ఉంది. అయితే అధికారుల వేధింపుల వల్లే కిషన్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనారోగ్య కారణాలతో సిక్ లీవ్ పెట్టినా మంజూరు చేయలేదని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో మిర్చి రైతు ఆత్మహత్య (Farmer Suicide)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అప్పుల బాధతో మిరప రైతు కరుణాకర్ (40) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 4న పురుగుల మందు తాగిన కరుణాకర్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం రైతు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.