Hyderabad News : అనుమతి లేకుండా పెళ్లి బరాత్, అడ్డుకున్న పోలీసులపై ప్రతాపం-జైలుపాలైన పెళ్లికొడుకు దోస్త్
Hyderabad News : దోస్త్ పెళ్లి అంటే మామూలుగా ఉండకూడదని భారీ సౌండ్ తో బరాత్ నడిపాడో స్నేహితుడు. ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.
Hyderabad News : పెళ్లి తంతు అంటే దోస్తులు మస్త్ ఖుషి అవుతారు. పెళ్లి తర్వాత పార్టీ చేసుకుని బరాత్ లో డ్యా్న్స్ ఇరగదీస్తారు. అయితే కొన్నిసార్లు దోస్తుల ప్రవర్తన కంట్రోల్ తప్పి చిక్కులు కూడా వస్తాయి. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకూ బరాత్ చేయడంతో పాటు మద్యం మత్తులో పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడో వ్యక్తి. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అతడికి రూ.650 ఫైన్ తో పాటు 10 రోజుల జైల్ శిక్ష విధించింది.
అసలేం జరిగింది?
సికింద్రాబాద్ కార్ఖాణ పీఎస్ పరిధిలో వివాహ వేడుక జరుపుకొని బరాత్ తీస్తూ శబ్దకాలుష్యంతో పాటు ట్రాఫిక్ కూడా అంతరాయం చేస్తున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కార్ఖాణ పోలీసులు అక్కడికి చేరుకొని పెళ్లి బరాత్ ను నివారించే ప్రయత్నం చేయగా మద్యం మత్తులో ఉన్న పెళ్లికొడుకు స్నేహితుడు శ్రవణ్ రెచ్చిపోయి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అక్కడి అగకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు ఇన్ స్పెక్టర్ రవిందర్ యాదవ్ తెలిపారు. ఈ రకంగా ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినా, అనుమతులు లేకుండా బరాత్ తీసినా సహించబోమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.
పుట్టినరోజుకు పిలిచి దాడి
కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరపాలనుకున్నాడు. ఈ క్రమంలోనే బంధువులు, స్నేహితులందరినీ పిలిచాడు. గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేట్ చేశాడు. ఆపై అంతా కలిసి విందు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అతడు ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆపై ఇంటికి వచ్చిన బంధువుల్లో ఒక వ్యక్తిని కారు ఇవ్వమని అడిగాడు. అయితే ఇతను ఫుల్లుగా తాగి ఉండడంతో అతను ఇవ్వనని చెప్పాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన సదరు వ్యక్తి.. అందరిపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టం వచ్చినట్లుగా దొరికిన వాటితో కొట్టి.. వారందరినీ ఇంట్లో బంధించి తాళం వేశాడు. వారు 100 డయల్ కు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పగా పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకొని సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
వికారాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న అత్వెల్లికి చెందిన నవీన్ అనే వ్యక్తి భార్యా, ఓ కుమారుడు ఉన్నారు. అయితే ఫిబ్రవరి 13వ తేదీన వీరి కొడుకు మొదటి పుట్టిన రోజు. కుమారుడి పుట్టిన రోజును ఘనంగా చేయాలనుకున్న తల్లిదండ్రులు.. బర్త్ డే కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బంధువులతో పాటు స్నేహితులందరినీ పిలిచారు. ఇంటికి వచ్చిన అందరికీ సకల మర్యాదలూ చేశారు. కుమారుడితో కేక్ కూడా కట్ చేయించారు. ఆపై అందరూ విందులో పాల్గొన్నారు. పురుషులు మద్యం సేవించగా.. మహిళలు భోజనం చేశారు. ఇప్పటి వరకూ అంతా బాగానే ఉంది. కానీ నవీన్ ఫుల్లగా మద్యం సేవించాడు. ఇదే పుట్టిన రోజు వేడుకల్లో అల్లకల్లోలం జరిగేలా చేసింది.
100 డయల్ కు ఫోన్ చేసి తప్పించుకున్న బంధువులు
మద్యం మత్తులో ఉన్న నవీన్.. తమ బంధువుల్లో ఒకరైన రాజు దగ్గరకు వెళ్లి తన కారును కాసేపు ఇవ్వమని కోరాడు. అయితే నవీన్ అప్పటికే బాగా తాగి ఉండడంతో.. రాజు వద్దు ఇవ్వవనని చెప్పాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన అతడు.. ముందుగా రాజుపై, ఆపై బర్త్ డేకు వచ్చిన పిల్లా, పెద్దలందరిపై దాడికి పాల్పడ్డాడు. అందిన వాటితో వాళ్లను కొడుతూ నానా రచ్చ చేశాడు. వారందరినీ ఇంట్లో బంధించి బయట తాళం వేశాడు. అతడేం చేస్తున్నాడో తెలియక లోపల బంధీగా ఉన్న బంధువులు, స్నేహితులంతా భయంతో గజగజా వణికిపోయారు. ఈ క్రమంలోనే 100 డయల్ కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నవీన్ ను అరెస్ట్ చేసి బంధువులు, స్నేహితులను బయటకు తీసుకవచ్చారు. బయటకు వచ్చిన వారంతా తిరిగి వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయారు.