Jubilee Hills Police Station : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత, బాలికపై అత్యాచారం కేసును నీరుగారుస్తున్నారని బీజేపీ ఆందోళన
Jubilee Hills Police Station : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ను బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. బాలికపై అత్యాచారం కేసును పోలీసులు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Jubilee Hills Police Station : హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పీఎస్ ను బీజేపీ శ్రేణులు ముట్టడించాయి. బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎవరినో రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బాలికను కారులో బంధించి లైంగికదాడికి పాల్పడిన వారిని ఎందుకు అరెస్టు చేయడంలేదని బీజేపీ నేతలు నిలదీశారు. బాలికకు న్యాయం జరిగేదాకా అండగా ఉంటామన్నారు. ఈ కేసులో ప్రజాప్రతినిధుల కుమారులు, మనువళ్లు ఉన్నందుకే కేసును నీరుగారుస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కారు దొరికినా నిందితులను పట్టుకోకపోవడం వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు.
కేసును నీరుగార్చేందుకే
బాలికపై లైంగిక దాడి కేసులో షీ టీమ్స్ ఏమయ్యాయని ఎమ్మెల్యే రఘునందన్ ప్రశ్నించారు. హోంమంత్రి మనవడి పెళ్లి సందర్భంగా పబ్‌లో పార్టీ ఇచ్చినట్లు రఘునందన్ ఆరోపించారు. హోంమంత్రి పీఏ పబ్ ముందు ఉన్న దృశ్యాలు ఉన్నారన్నారు. కేసులో నిందితుల పేర్ల స్థానంలో కారు నంబర్ ఉండడం ఏమిటని ఆయన నిలదీశారు. మే 28న లైంగికదాడి జరిగితే మే 31 వరకు ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని రఘునందన్ ప్రశ్నించారు. ఈ ఘటనలో నిందితులను తారుమారు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ కేసులో రాజకీయ పార్టీల నేతలు ఉన్నందునే కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ఘటన జరిగిన మూడ్రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
బాలికపై అత్యాచారం!
ఆమ్నేషియా పబ్ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. తనపై అత్యాచారం జరిగిందంటూ బాలిక స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 28వ తేదీ సాయంత్రం5 గంటలకి గుర్తుతెలియని యువకులు తనను బలవంతంగా కారులో తీసుకెళ్లారని బాలిక తెలిపింది. రాత్రి 7 గంటలకు పబ్ దగ్గర వదిలి పెట్టారని పేర్కొంది. కారులో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఆమ్నేషియా పబ్‌లో పార్టీ చేసుకున్నామని, పార్టీలో కొందరు యువకులు తనను బెంజ్ కారులో బలవంతంగా తీసుకెళ్లారని బాలిక వెల్లడించింది. బెంజ్ కారులో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపింది. ఈ విషయం గురించి తండ్రికి చెప్పానని బాలిక అంటోంది. తన మెడ దగ్గర తీవ్ర గాయాలయ్యాయని పేర్కొంది. తన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపింది.