Jubilee Hills Minor Girl Case : జూబ్లీహిల్స్ బాలికపై అత్యాచారం కేసు, రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Jubilee Hills Minor Girl Case : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కార్పొరేట్ కుమారుడు, సాదుద్దీన్ మాలిక్ ఇద్దరు బాలికలను వేధించినట్లు తెలుస్తోంది.
Jubilee Hills Minor Girl Case : హైదరాబాద్ జూబ్లీహిల్స్ బాలికపై సామూహిక అత్యాచారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. నిందితులు బాధిత బాలికతోపాటు మరో బాలికను కూడా వేధించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం మొత్తానికి కార్పొరేటర్ కుమారుడే కీలక సూత్రధారిగా పోలీసులు నిర్థారించారు. అతడు సాదుద్దీన్ మాలిక్‌తో కలిసి పబ్‌లో అరాచకాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సాదుద్దీన్ మాలిక్, కార్పొరేటర్ కొడుకు కలిసి ఇద్దరు బాలికలను వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వేధింపులు భరించలేక పబ్ నుంచి బాలికలు ఇద్దరూ బయటకు వచ్చేశారు. అయితే ఒక బాలిక పబ్ నుంచి బయటకు నేరుగా క్యాబ్ తీసుకొని వెళ్లిపోయింది. సాదుద్దీన్ అండ్ గ్యాంగ్ బాలికల వెనకాలే బయటకు వచ్చారు. పబ్ ముందే నిలబడ్డ బాధిత బాలికను కార్పొరేటర్ కొడుకు ట్రాప్ చేశాడు. ఇంటి వద్ద దించుతామని నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మనవడు ఉమేర్‌ఖాన్‌కు చెందిన బెంజ్ కారులో అమ్మాయితో కలిసి నలుగురు ప్రయాణం చేశారు.
ఎంజాయ్ చేశామని గ్రూప్ ఫొటో
పబ్ నుంచి నేరుగా కాన్సూ బేకరి వరకు కారులో వెళ్లారు. బెంజ్ కారులోనే అమ్మాయి పట్ల గ్యాంగ్ అసభ్యంగా ప్రవర్తించారు. అరాచకాలు భరించలేక కాన్సూ బేకరి నుంచి వెళ్లిపోతానని బాధిత బాలిక చెప్పింది. బాలికను మళ్లీ బెంజ్ కారులో ఎక్కించుకొని కొద్దిదూరం ప్రయాణం చేశారు. అయితే ఫోన్ కాల్ రావడంతో ఎమ్మెల్యే కుమారుడు మధ్యలోనే కారు దిగి వెళ్లిపోయాడు. బెంజ్ కారులో పెట్రోల్ అయ్యిపోయిందంటూ డ్రామాలు ఆడిన యువకులు, వెనకాలే వచ్చిన ఇన్నోవాలో కారులోకి బాలికను తరలించారు. ఇన్నోవాలో వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ కుమారుడు ఉన్నాడు. బంజారాహిల్స్‌లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ తర్వాత బేకరికి వచ్చిన నిందితులు, ఎంజాయ్ చేశామని గ్రూప్ ఫొటో దిగి ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఆ తర్వాత నిందితులు బేకరి నుంచి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.
వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఫాంహౌస్ లో ఇన్నోవా కారు
ఈ ఘటన వెలుగులోకి వచ్చి కేసు నమోదుకాగానే నిందితులు హైదరాబాద్ నుంచి పారిపోయారు. ఇన్నోవా కారును వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ ఫాంహౌస్‌లో దాచారు నిందితులు. ఈ ఘటనలో ఇప్పటికే ఒక మేజర్‌తో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులు ఉపయోగించిన కార్లలో ఒకటి ఇన్నోవా కారు. మరో బెంజ్ కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్లలో క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు తనిఖీ చేయగా, మెర్సిడిస్ బెంజి కారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి. బాధిత బాలిక జుట్టు, చెప్పు, కమ్మను క్లూస్ టీమ్ నిపుణులు గుర్తించారు. ఇన్నోవా కారులోనూ బాలిక జుట్టుతో పాటు నిందితుల వీర్య నమూనాలను కూడా ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. వాటిని సేకరించి ఫోరెన్సిక్ లేబొరేటరీకి పోలీసులు పంపించారు. అయితే ఈ కేసులో ఓ ఎమ్మెల్యే కొడుకు పాత్ర కూడా ఉందని వాదనలు వస్తున్నాయి. కానీ అతనికి సంబంధం లేదని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు. అతను ఎమ్మెల్యే కొడుకే అని బీజేపీ నేతలు నొక్కి చెబుతున్నారు. ఈ ఫోరెన్సిక్ నివేదికలు వస్తే అసలు విషయం తేలనుంది. అదే నిజమైతే ఎమ్మెల్యే కొడుకు పేరు కూడా ఎఫ్ఐఆర్ లో ఏ-6గా పెట్టే అవకాశం ఉంది.