Hyderabad fire accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం - వ్యక్తి సజీవదహనం
Hyderabad fire accident: అబిడ్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కారు మెకానిక్ షాపులో ప్రమాదం జరగ్గా ఏడు కార్లతో పాటు వ్యక్తి సజీవ దహనం అయ్యాడు.
Hyderabad fire accident: హైదరాబాద్ అబిడ్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదం ఓ సెక్యూరిటీ గార్డు సజీవ దహనం అయ్యాడు. అలాగే ఏడు కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
అసలేం జరిగిందంటే..?
అబిడ్స్ లోని బొగ్గుల కుంట కామినేని ఆస్పత్రి పక్కనే ఉన్న ఓ కారు మెకానిక్ షెడ్ లో ఒక్కసారిగా మంటలు చెరేగాయి. అగ్నికీలాలు ఎక్కువై షెడ్ మొత్తాన్ని ఆక్రమించాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించగా.. స్థానికులంతా పరుగు పరుగున వచ్చారు. వెంటనే పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆలోపే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఏడు కార్లు పూర్తిగా కాలిపోయాయని.. అలాగే కారులో నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డు సంతోష్ కూడా సజీవ దహనం అయ్యాడని వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు..!
హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 16వ తేదీ రోజే సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగి ఆరుగురు చనిపోగా.. 18వ తేదీ రోజు రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న తుక్కు గోదాంలో ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తుల మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో.. స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గోదాంలో అధిక మొత్తంలో ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి. దట్టమైన పొగ వస్తుండడంతో.. అక్కడి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రమాదం జరిగినట్లు గుర్తించిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్పందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదంలో తుక్కు కోసం వినియోగించే రెండు డీసీఎం వాహనాలు దగ్ధం అయ్యాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ యే కారణం అని ప్రాథమికంగా భావిస్తున్నారు.
తూతూ మంత్రంగానే చర్యలు..
సికింద్రాబాద్ పరిధిలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. గురువారం స్వప్నలోక్ షాపింగ్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించడంతో అసలు అగ్ని ప్రమాదాలకు కారణాలపై చర్చ సాగుతోంది. అగ్నిప్రమాదాలు జరిగిన అన్ని చోట్లా అక్రమ గోదాములే ప్రధాన కారణంగా తెలుస్తోంది. జనవరిలో డెక్కన్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం తర్వాత హడావుడి చేసిన ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు తూతూమంత్రంగా చర్యలు చేపట్టారు. డెక్కన్ మాల్ ఘటన తర్వాత అగ్ని ప్రమాదాల నివారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసిన అధికారులు.. రెండు సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత ఆ సంగతి మర్చిపోయారు. స్థానికంగా కొందరు కిందిస్థాయి అధికారులకు ఆమ్యామ్యాలు అందుతుండటంతో ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రమాదం జరిగాక హడావుడి చేయడం కన్నా.. ముందే అప్రమత్తమైతే ప్రాణాలతో పాటు ఆస్తినష్టం జరగకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.