Fake Certificates : నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు, లిస్ట్ లో 13 యూనివర్సిటీలు!
Fake Certificates : యూనివర్సిటీల్లో కంపూటర్ ఆపరేటర్స్ తో కుమ్మక్కై నకిలీ సర్టిఫికెట్లు తయారుచేస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
Fake Certificates : అంతర్రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు. ఈ కేసు వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర మీడియాకు తెలిపారు. దాదాపు 13 యూనివర్సిటీలకు చెందిన 140 ఫేక్ సర్టిఫికెట్లను ఈ ముఠా ముద్రించింది. ఇప్పటికి 30 మందికి ఈ నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసింది. ఈ నకిలీ సర్టిఫికెట్స్ దందా చెలామణి చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. కొంతమంది యూనివర్సిటీ కంప్యూటర్ ఆపరేటర్స్ తో కుమ్మకై నకిలీ సర్టిఫికెట్లు ప్రింట్ చేస్తున్నారన్నారు. ఎవరికైతే నకిలీ సెర్టిఫికెట్ అవసరం ఉన్నదో వాళ్లను ఆసరా చేసుకుని ఈ రాకెట్ నడుపుతున్నారని డీసీపీ తెలిపారు.
ఒక్కొక్క సర్టిఫికెట్ కు రూ. 50 వేల నుంచి రూ. లక్ష
నిందితులపై హైదరాబాద్ లోని పలు పోలీసుస్టేషన్ లలో చీటింగ్ కేసులు నమోదయ్యాయని డీసీపీ తెలిపారు. తమిళనాడు అన్నా యూనివర్సిటీ సర్టిఫికెట్లు గో డాడీ వెబ్ సైట్ అందిస్తున్నారన్నారు. ప్రజలు ఎవరూ ఇలాంటి నకిలీ సర్టిఫికెట్స్ కు ప్రలోభ పడవద్దని కోరుతున్నామని తెలిపారు. నకిలీ సర్టిఫికెట్స్ ద్వారా ఎలాంటి ఉద్యోగం పొందిన తరువాత అనేక ఇబ్బందులకు గురైతారని డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. ఒక్కొక్క సర్టిఫికెట్ కు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు వసూలు చేస్తున్నారన్నారు. ఈ కేసులో మొహమ్మద్ ఏతేషాం ఉద్దిన ఉసేన్, మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్, మొహమ్మద్ అల్తాఫ్ అహ్మద్ మొహమ్మద్ ఇమ్రాన్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు. మరో ఇద్దరు కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామన్నారు.
గంజాయి డెలివరీ చేస్తున్న జొమాటో బాయ్
జొమాటో డెలివరీ బాయ్‌గా పని చేస్తూ అదనపు డబ్బుల కోసం గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని తుకారాంగేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. 600 గ్రాముల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, ఒక మొబైల్ ఫోన్, 5వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని రిమాండ్‌కు తరలించారు. మల్కాజ్‌గిరికి చెందిన చుంచు నితీష్ చంద్ర జొమాటో డెలివరి బాయ్‌గా పని చేస్తున్నాడు. అదనపు డబ్బుల కోసం గంజాయి అమ్మడం మొదలు పెట్టాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. నిఘా పెట్టిన పోలీసులు అతన్ని రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా పెడ్లర్ రాహుల్ ఆదేశాల మేరకు చీత, కలాకన్, స్వీట్ లాంటి కోడ్ భాషలను ఉపయోగించి గంజాయి అమ్మకాలు సాగిస్తున్నాడు. ఇప్పటి వరకు 30మందికి గంజాయిని సరఫరా చేసినట్లు తెలింది.
విద్యార్థులు, యువతే టార్గెట్
నితీష్ వద్ద గంజాయిని కొన్న వ్యక్తులపై పోలీసులు నిఘా పెట్టారు. 30 మందిలో 20మందిని గుర్తించినట్టు తెలిపారు. వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నితీష్ చంద్రను అరెస్టు చేసిన విషయం తెలిసిన వెంటనే ప్రధాన నిందితుడు రాహుల్ బోనగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడని వెల్లడించారు. రాహుల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తే గంజాయి సరఫరాకు సంబంధించిన నెట్ వర్క్ ఇంకా పెద్ద ఎత్తున బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. విద్యార్థులు, యువత దీనికి ఆకర్షితులై తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవడమే కాకుండా తమ కుటుంబ సభ్యులకు కూడా మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తమ పిల్లలు ఏం చేస్తున్నారు... ఎలాంటి వారితో తిరుగుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు.