Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులో రేపటి నుంచి పోలీసు కస్టడీకి టోనీ... పరారీలో ఉన్న వ్యాపారవేత్తల కోసం పోలీసుల గాలింపు
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీని రేపటి నుంచి విచారిస్తామని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఈ కేసులో బడా వ్యాపారస్థులు ఉన్నారని దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.
హైదరాబాద్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో హై ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నారని పోలీసులు అంటున్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీతో నగరంలోని కొందరు బడా వ్యాపారులకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తేనే అసలు విషయాలు బయటపడతాయని పోలీసులు అంటున్నారు. పరారీలో ఉన్న నలుగురు వ్యాపారుల కోసం గాలిస్తున్నామని హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ప్రధాన నిందితుడు టోనీని రేపటి నుంచి పోలీసు కస్టడీలోకి తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌లో మాట్లాడిన ఆయన.. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో రేపు టోనీని ప్రశ్నిస్తామన్నారు. ఈ విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. రేపటి నుంచి ఫిబ్రవరి 2 వరకు విచారణ చేసేందుకు కోర్టు అనుమతిచ్చిందన్నారు. డ్రగ్స్ కేసులో చంచల్‌గూడ జైల్లో ఖైదీలుగా ఉన్న వ్యాపారులను కస్టడీకి ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.
మరో 15 మంది బడా వ్యాపారవేత్తలు
డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీని పోలీస్ కస్టడీకి అప్పగించడానికి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ టోనీని ఐదురోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో రేపటి నుంచి ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలో టోనీని విచారించనున్నారు. టోనీకి హైదరాబాద్‌లోని వ్యాపారస్థులతో సంబంధాలపై పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఏడు మంది వ్యాపారవేత్తలను అరెస్టు చేశారు. టోనీని మరింత లోతుగా విచారిస్తే మరికొందరి పేర్లు బయటపెడతాడని పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. హైదరాబాద్‌లో బడా పారిశ్రామిక వేత్తలుగా ఉన్న గజేంద్ర, విపుల్‌లు టోనీ అనే వ్యక్తి నుంచి కొన్నేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో రూ.500 కోట్ల పైచిలుకు వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలు మరో 15 మందికి టోనీ డ్రగ్స్ అమ్మినట్లు దర్యాప్తు తేలిందన్నారు. ఈ 15 మంది వ్యాపారవేత్తల వద్ద వివరాలను సేకరిస్తామన్నారు.
బడా వ్యాపారవేత్తలు... డ్రగ్స్ కు బానిసలు
అరెస్టైన వ్యాపారవేత్తల్లో నిరంజన్ జైన్ 30 సార్లు టోనీ దగ్గర్నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నాడు. నిరంజన్ జైన్ చేసే వ్యాపారం వేల కోట్ల టర్నోవర్ కలిగి ఉంటుంది. పలు ప్రభుత్వ ప్రాజెక్టు పనుల కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు. నిరంజన్ జైన్ ఇచ్చే పార్టీలలో అనేక మంది ప్రముఖులు కూడా పాల్గొంటూ ఉంటారు. అలాగే పాత బస్తీ కేంద్రంగా నడుస్తున్న మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండీ ఆనంద్ కూడా డ్రగ్స్‌కు బానిసయ్యారు. వందల కోట్ల టర్నోవర్ తో ఆయన బిజినెస్ నడుస్తుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు శశావత్ జైన్, ప్రముఖ కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డి కూడా డ్రగ్స్‌కు బానిసయ్యారు. నిరంజన్ జైన్, సుమంత్ రెడ్డి కలిసి హైదరాబాదులో బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. అలాగే మరో ప్రముఖ వ్యాపారి బండి భార్గవ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎగుమతి, దిగుమతి వ్యాపార వర్గాల్లో ప్రముఖుడిగా ఉన్న వెంకట్ చలసానిని కూడా అరెస్టు చేశారు. భార్గవ్, వెంకట్ కలసి చదువుకుని కలసి వ్యాపారాలు చేస్తున్నారు. వందల కోట్లలో టర్నోవర్ నిర్వహిస్తూ డ్రగ్స్‌కు బానిసయ్యారు. అలాగే మరో వ్యాపారవేత్త తమ్మినేద సాగర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారు. వ్యాపారాల్లో ఆరితేరిపోయారు. కానీ డ్రగ్స్ బారి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. చివరికి కటకటాల పాలయ్యారు.