Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు
Rgv Complaint On Natti Entertainment : నిర్మాతలు నట్టి క్రాంతి, నట్టి కరుణపై ఆర్జీవీ పోలీస్ కేసు పెట్టారు. తన సైన్ ఫోర్జరీ చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆయన ఫిర్యాదు చేశారు.
Rgv Complaint On Natti Entertainment : తన సంతకం ఫోర్జరీ చేశారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులను ఆశ్రయించారు. నిర్మాతలు నట్టి క్రాంతి, నట్టి కరుణపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన సైన్ ను ఫోర్జరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'మా ఇష్టం' సినిమాకు సంబంధించిన లేటర్ రేట్ పై తన సంతకం ఫోర్జరీ చేశారని ఆర్జీవీ ఆరోపించారు. దీంతో నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ ఆర్జీవీపై కేసులు పెట్టడం చూసుంటారు, ఇప్పుడు ఆర్జీవీ వంతు వచ్చింది. నిర్మాతలు నట్టి క్రాంతి, నట్టి కరుణ మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ‘డేంజరస్’ సినిమా రిలీజ్ సమయంలో తనను డిస్టర్బ్ చేసిన నట్టి బ్యాచ్‌పై న్యాయపోరాటం మొదలుపెట్టారు. రూ. 50 లక్షలు ఇస్తానని తాను హామీ పత్రం ఇచ్చినట్లుగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టు తప్పుదోవపట్టించారని ఆర్జీవీ ఆరోపిస్తున్నారు.
నట్టి కుమార్ ఫైర్
అయితే ఆర్జీవీపై నిర్మాత నట్టి కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ పాత ఆఫీస్, ముంబయి ఆఫీస్‌లు ఎందుకు ఖాళీ చేశారో చెప్పాలన్నారు. ఆర్జీవీ చేసే చీటింగ్ వల్లే అన్ని చోట్లా తన ఆఫీసులు ఖాళీ చేస్తున్నారని ఆరోపించారు. ఆర్జీవీ చేతిలో మోసపోయిన వారంతా తనను కలుస్తున్నారన్నారు. కోర్టులో ఇష్యూ ఉన్న కారణంగా ఎక్కువ మాట్లాడకూదన్నారు. ఆర్జీవీ తీసిన సినిమాలు ఆపాలని నిర్మాతలు కోరుతున్నానన్నారు.
మరో వివాదం
దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఇటీవల మియాపూర్ పోలీసు స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. శేఖర్ ఆర్ట్ క్రియేషన్ యజమాని శేఖర్ రాజు... ఆర్జీవీ తన వద్ద రూ.56 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశ మూవీ నిర్మాణ సమయంలో డబ్బులు వర్మ తీసుకున్నారని, సినిమా విడుదలకు ముందే ఇస్తానని చెప్పి ఇప్పటి వరకూ ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. రమణారెడ్డి అనే కామన్ ఫ్రెండ్ ద్వారా ఆర్జీవీతో పరిచయం ఏర్పడిందని శేఖర్ రాజు తెలిపారు. జనవరి 2020లో రూ.8 లక్షలు, తర్వాత మరో రూ.20 లక్షలు, తర్వాత రూ. 28 లక్షల చొప్పున వర్మకు మొత్తంగా రూ.56 లక్షలు ఇచ్చానని శేఖర్ రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆశ సినిమా విడుదలకు ముందే తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇస్తానని వర్మ మోసం చేశాడన్నారు. ఆ చిత్రానికి వర్మ నిర్మాతే కాదని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.
హైకోర్టులో ఊరట
అయితే ఈ కేసులో తెలంగాణ హైకోర్టులో వర్మ ఊరట లభించింది. కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా శేఖర్ రాజు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని వర్మ అన్నారు. రాంగోపాల్ వర్మ సమర్పణలో 'ఆశ ఎన్‌కౌంటర్' సినిమా తెరకెక్కింది. 2019 నవంబర్‌లో హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా విడుదల అనేక సార్లు వాయిదా పడి చివరకి ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.