Hyderabad Crime News: ప్రేమించి పెళ్లాడింది, మరో వివాహం చేసింది - తర్వాతే అసలు కథ మొదలైంది!
Hyderabad Crime News: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త మెప్పు కోసం అతడికి మరో పెళ్లి చేసింది. ఆ తర్వాత బాలికకు దగ్గరవడం, మొదటి భార్యను వదిలించుకునే ప్రయత్నం చేయడంతో అతడిని చంపేసింది.
Hyderabad Crime News: వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయిన ఇద్దరూ పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టారు. ఏడేళ్లపాటు వీరి కాపురం హాయిగా సాగింది. ఆ తర్వాత నుంచే భార్యకు కల్లు, మద్యానికి అలవాటు పడింది. బానిసగా మారింది. భర్త మెప్పు కోసం అతడికి ఓ 17 ఏళ్ల బాలికను ఇచ్చి పెళ్లి చేసింది.
వ్యసనాల బారిన పడ్డ మొదటి భార్యను వదిలించుకోవడానికి అతడు స్కెచ్ వేశాడని గ్రహించి కౌంటర్ ప్లాన్ వేసింది. అది కూడా అతనికి ఇష్టమైన రెండో భార్యతోనే మొదటి భార్య స్పాట్ పెట్టింది. కడతేర్చింది. ఫుల్లుగా మద్యం తాగించి అతని మెడకు చన్నీని చుట్టి చెరోవైపు లాగి మరీ చంపేశారా ఇద్దరు సతీమణిలు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ఓ సంచిలో కట్టి వాళ్లుంటున్న రెండో ఫ్లోర్ నుంచి కింద పడేశారు. అనంతరం చేతులు దులుపుకొని సరికొత్త డ్రామా మొదలు పెట్టారు. కానీ చివరకు బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు చిక్కారు.
అసలేం జరిగిందంటే..?
సురేష్, రేణుకలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే 2016లో ప్రేమ వివాహం జరిగింది. ఆమె క్రమంగా చెడు వ్యసనాల బాట పట్టింది. ప్రతిరోజూ మద్యం, కల్లు దుకాణాల వద్దే కూర్చొని మరీ ఫుల్లుగా తాగేది. ఆపై తూలుతూ ఇంటికొచ్చేది. మద్యం మత్తులో ఎవరితో పడితే వాళ్లతో మాటలు కలిపేదనే ఆరోపణలు కూడా రేణుకపై ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం బహదూర్ పల్లిలోని ఓ కల్లు దుకాణం వద్ద దుండిగల్ తండాకు చెందిన అనాథ బాలికతో మాట కలిపింది. ఇలా ఆమెతో స్నేహం పెంచుకుంది. బాలికకు ఎవరూ లేకపోవడంతో తన ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంది. రేణుక, సురేష్ లతో పాటే 15 రోజుల పాటు బాలిక అక్కడే ఉంది.
భర్త మెప్పు పొందేందుకు ఇంటికి వచ్చిన ఆ చిన్నారితో.. రహస్యంగా ఇంట్లోనే భర్తకు ఇచ్చి పెళ్లి చేసింది. అయితే సురేష్ క్రమంగా బాలికకు దగ్గరవడం ప్రారంభించాడు. ఆమెపై ఆసక్తి చూపించడం, మొదటి భార్య రేణుకను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముగ్గురూ కలిసి ఆదివారం రోజు ఫుల్లుగా తాగారు. భర్త మద్యం మత్తులో నిద్రపోవడంతో బాలికతో కలిసి శాలువాను మెడకు బిగించి... ఇద్దరు భార్యలు చెరోవైపు పట్టుకొని గట్టిగా లాగారు. ఈ క్రమంలోనే సురేష్ మృతి చెందాడు. అయితే భర్త చనిపోయినట్లు నిర్ధారించుకున్న సతీమణులు... ఓ సంచిలో అతడి మృతదేహం వేసి వాళ్లు ఉంటున్న భవనం రెండో ఫ్లోర్ నుంచి ఇంటి ముందు పడేశారు. అయితే ఈ నేరం నుంచి తప్పించుకునేందుకు అందమైన కట్టుకథను కూడా అల్లారు.
భర్తను చంపి కింద పడేసిన అనంతరం నరేష్ బంధువులకు ఫోన్లు చేసిన రేణుక... తినేందుకు మటన్, మల్లెపూలు తీసుకురావాలని భర్తను బయటకు పంపించినట్లు తెలిపింది. అయితే అతడు తిరిగి రాలేదని రేణుక నమ్మబలికింది. మరుసటి రోజు తన భర్తను ఎవరో చంపి.. ఇంటి ముందే మృతదేహాన్ని వదిలేసినట్లు సమాచారం. ఏమీ తెలియనట్లు ఠాణాకు వెళ్లి విలపించింది. బంధువులు భార్యపై అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.