Ganja Siezed: తెలుగు రాష్ట్రాల్లో మత్తు కలకలం - ఏపీలో 912 కిలోల గంజాయి పట్టివేత, తెలంగాణ రూ.8.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
Crime News: తెలుగు రాష్ట్రాల్లో మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏపీలో 912 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా.. తెలంగాణలో రూ.8.5 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు.
Ganja And Drugs Seized In Ap And Telangana: తెలుగు రాష్ట్రాల్లో మత్తు కలకలం రేపుతోంది. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా కొందరు ఈ దందా ఆపడం లేదు. తాజాగా, ఏపీలో అక్రమంగా తరలిస్తోన్న గంజాయిని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అటు, హైదరాబాద్‌లోనూ (Hyderabad) రూ.కోట్ల విలువైన డ్రగ్స్‌ను పెద్ద మొత్తంలో సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి ఏపీకి లారీలో తరలిస్తోన్న దాదాపు 912 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లాలో (Anakapalli) సోమవారం ఉదయం పోలీసుల తనిఖీల్లో గంజాయిని పట్టుకుని.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ దీపిక తెలిపారు. మరో ఐదుగురిని అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.45 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
అటు, విజయవాడలో ఇప్పటివరకూ దాదాపు 200 కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్నట్లు డీసీపీ హరికృష్ణ తెలిపారు. మొత్తం 35 కేసులు నమోదు చేశామని.. గంజాయి విక్రయిస్తోన్న 120 మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. మత్తు పదార్థాలు సేవించే 150 ప్రాంతాలను గుర్తించామని.. అనుమానాస్పద ప్రాంతాల్లో నిఘా పెడుతున్నట్లు చెప్పారు. యువత మత్తుకు బానిస కావొద్దని.. అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
రూ.8.5 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
అటు, తెలంగాణలోనూ పోలీసులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా ఎక్కడో ఓ చోట అక్రమార్కులు రవాణా చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని బోయిన్పల్లి పరిధిలో పోలీసులు ఆదివారం రాత్రి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు జిన్నారం నుంచి ఎఫిటమైన్ డ్రగ్స్ తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో తనిఖీలు చేపట్టి సీజ్ చేశారు. బోయిన్పల్లి మీదుగా సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద డెలివరీ చేసేందుకు కారులో తరలిస్తున్నట్లు గుర్తించిన హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్ పోలీసులు.. స్థానిక పోలీసుల సాయంతో డెయిరీ ఫామ్ రోడ్డు వద్ద నిందితుల వాహనాన్ని అడ్డగించారు. కారు డిక్కీలోని 8.5 కిలోల ఎఫిటమైన డ్రగ్స్‌ను సీజ్ చేసి.. డ్రైవర్ వినోద్, నాగరాజు, శ్రీశైలంలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ.8.5 కోట్లు ఉంటుందని తెలిపారు.
మరోవైపు, రాజేంద్రనగర్‌లోనూ పోలీసులు 50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ను బెంగుళూరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో నైజీరియాకు చెందిన మహిళను అరెస్ట్ చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. దంపతులతో పాటు మరో ముగ్గురు కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
'నిందితులపై కఠిన చర్యలు'
డ్రగ్స్ సరఫరా చేసే నిందితులపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. బోయిన్పల్లి వద్ద వాహన తనిఖీల్లో 8.5 కిలోల ఎఫిటమైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా.? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.