Inspector Nageshwara Rao: ఐదు రోజుల పోలీస్ కస్టడీకి సీఐ నాగేశ్వరరావు- హయత్ నగర్ కోర్టు అనుమతి!
Inspector Nageshwar Rao: అత్యాచార ఆరోపణలతో సస్పెండ్, అరెస్ట్ అయి నేరాన్ని అంగీకరించిన ఇన్స్ పెక్టర్ నాగేశ్వర రావును ఐదు రోజుల పోలీసుల కస్టడీకి హయత్ నగర్ కోర్టు అనుమతిని ఇచ్చింది.
Inspector Nageshwar Rao: అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయి, ఆ తర్వాత నేరాన్ని అంగీకరించాడు సీఐ నాగేశ్వరరావు. నేడు ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావును ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇస్తూ హయత్ నగర్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు నుంచి 22వ తేదీ వరకు నాగేశ్వర రావును వనస్థలిపురం పోలీసులు విచారించనున్నారు. అత్యాచారం జరిగిన స్థలంతో పాటు ఇబ్రహీంపట్నం కారు ప్రమాద స్థలంలో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయనున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఈనెల 6వ తేదీన వివాహితపై అత్యాచారం చేసి, బాధితురాలితో పాటు ఆమె భర్తను బలవంతంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంటప్నం పరిధిలోని ఎల్మినేడుకు తీసుకెళ్తుండగా... కారు ప్రమాదానికి గురైంది. కారు నడుపుతున్న సీఐ నాగేశ్వరరావు భుజానికి గాయం కావడంతో బాధిత దంపతులు ఇద్దరూ తప్పించుకొని వనస్థలిపురం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇలా నాగేశ్వరరావు చేసిన దురాగతం బయట పడింది. విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఇన్స్ పెక్టర్ నాగేశ్వరరావును సస్పెండ్ చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే అజ్ఞాతంలోకి..
ప్రమాదంలో గాయపడిన నాగేశ్వరరావు ముందుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. బాధితులతో మాట్లాడి రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అది ఫలించకపోవడంతో మిన్నుకుండిపోయాడు. అయితే కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఉన్నతాధికారులు ఇన్స్ పెక్టర్ నాగేశ్వరరావును పట్టుకునేందుకు మూడు పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే ఎస్ఓటీ పోలీసులు జులై 11వ తేదీన ఇన్స్ పెక్టర్ నాగేశ్వర రావును అరెస్ట్ చేశారు. అయితే నాగేశ్వర రావు గత రెండేళ్లుగా బాధితురాలిని లైంగికంగా వేధిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. సెక్షన్ 452, 376(2), 307, 448, 365 ఐపీసీ, ఆయుధాల చట్టం సెక్షన్ 30 కింద కేసు నమోదు చేశారు.
ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతి..
ఈ క్రమంలోనే నిందితుడు నాగేశ్వరరావును పోలీసులు హయత్ నగర్ కోర్టులో హాజరు పరిచారు. మొన్నటి నుంచి రిమాండ్ లో ఉన్న నిందితుడిని మరోసారి విచారిస్తామని వనస్థలిపురం పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇందుకు ఒప్పుకున్న హయత్ నగర్ కోర్టు ఇన్స్ పెక్టర్ నాగేశ్వర రావును ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. అయితే ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు అంటే జులై 22వ తేదీ వరకు ఇన్స్ పెక్టర్ నాగేశ్వర రావును పోలీసులు విచారించనున్నారు. అత్యాచారం జరిగిన ఘటనా స్థలంతో పాటు కారు ప్రమాదానికి గురైన చోటులో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయనున్నారు.
అయితే ఈ ఘటన విషయం తెలుసుకున్న ప్రజలు పోలీసు వ్యవస్థపై విపరీతంగా ఫైర్ అవుతున్నారు. కాపాడాల్సిన వాళ్లే ఇలా చేస్తే ఎలా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరచుగా తలెత్తుతున్నాయంటూ చెబుతున్నారు. కళ్లల్లో పెట్టుకొని కాపాడాల్సిన అధికారులే కాటేస్తుంటే ఏం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.