Guntur: మాజీ లవర్‌కి ఎంగేజ్‌మెంట్, అయినా వదలని యువకుడు - ఫ్యామిలీని పంచాయితీకి పిలిచి దుశ్చర్య!
తన ప్రేమను అంగీకరించడం లేదనే అక్కసుతో యువకుడు యువతి వెంట పడి వేధించాడు. అంతటితో ఆగకుండా కత్తులతో ఆమెపై, కుటుంబ సభ్యులపైన కూడా దాడి చేశాడు.
Guntur Lovers News: ప్రేమ పేరుతో ఓ యువకుడు రెచ్చిపోయి, నేరాలకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో (Guntur News) జరిగింది. యువతి తన ప్రేమను అంగీకరించడం లేదనే అక్కసుతో ఆమె వెంట పడి వేధించాడు. అంతటితో ఆగలేదు. యువతికి పెళ్లి కుదిరిన తర్వాత కూడా వెంట పడ్డాడు. అప్పుడు కూడా ఆమె కాదు అని అనడంతో కత్తులతో ఆమెపైనే కాక కుటుంబ సభ్యులపైన కూడా దాడి చేశాడు.
గుంటూరు (Guntur News) జిల్లా ఫిరంగిపురంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన పేరం ఏడుకొండలు అనే యువకుడు ఒక సంవత్సరానికి పైగా అదే ఏరియాకి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా అతని సామాజిక వర్గానికి చెందిన యువతే. ఆ ప్రేమ విషయం యువతికి చెప్పగా ఆమె నిరాకరించింది. చాలా రోజులుగా ఆమె వెంట పడి ప్రేమించాలంటూ వేధిస్తూనే ఉన్నాడు. ఆ వేధింపులు భరించలేక యువతి, ఆ యువకుడు వేధిస్తున్న సంగతి ఇంట్లో చెప్పింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడ్ని బాగా మందలించారు. ఆ తర్వాత కొంత కాలం యువకుడు ఏడుకొండలు ఆమెను వేధించకుండా ఉన్నాడు.
పంచాయితీ వరకూ..
అయితే, ఈ మధ్య తనను ప్రేమించాలంటూ మళ్లీ కొద్ది రోజులుగా వేధిస్తూ ఉన్నాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులకు మరోసారి ఈ విషయం చెప్పింది. అప్పటికే ఇంట్లో ఆమెకు సంబంధాలు చూస్తూ ఉండడంతో అదే సమయంలో ఆమెకు మరో యువకుడితో పెళ్లి కుదిరింది. కొద్దిరోజుల కిందటే ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. ఈ విషయం తెలుసుకున్న యువకుడు ఏడుకొండలు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ విషయంపై కుల పంచాయితీ పెట్టారు.
అక్టోబరు 23న సాయంత్రం ఊళ్లో పెద్ద మనుషుల సమక్షంలో రెండు కుటుంబాల వారు సమావేశం అయ్యారు. ఏడుకొండలు అంటే తనకు ఇష్టం లేదని, తాను అతణ్ని పెళ్లి చేసుకోనని పెద్దల ముందు యువతి తేల్చి చెప్పేసింది. దీంతో కోపం పెంచుకున్న యువకుడు ఏడుకొండలు, అతని కుటుంబ సభ్యులు, బంధువులు మూకుమ్మడిగా కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లతో యువతి కుటుంబంపై దాడికి దిగారు.
ఈ దాడిలో అంజలితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం జీజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయాలు బాగా కావడంతో యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన మరో 9 మంది కుటుంబ సభ్యులను నరసరావుపేటలోని ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. ప్రశాంతంగా జరుగుతున్న పంచాయితీలో ఒక్కసారిగా గొడవలు, దాడులు మొదలు కావడంతో కాలనీలో భయానక వాతావరణం ఏర్పడింది. దీంతో స్థానికులు పరుగులు పెట్టారు. వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. చివరికి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Also Read: Nellore : అంత్యక్రియలు పూర్తైన కొడుకు తిరిగొచ్చాడు, నెల్లూరులో విచిత్ర ఘటన