Rishiteshwari Case: సంచలన కేసులో బిగ్ ట్విస్ట్ - రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టేసిన న్యాయస్థానం, తమకు ఆత్మహత్యే శరణ్యమన్న పేరెంట్స్
Guntur News: తెలుగు రాష్ట్రాల్లోనే సంచలన సృష్టించిన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు జిల్లా న్యాయస్థానం కొట్టేసింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయిందని తీర్పు వెలువరించింది.
Rishiteshwari Suicide Case Dismissed: తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన రిషితేశ్వరి (Rishiteshwari Case) ఆత్మహత్య కేసును గుంటూరు జిల్లా కోర్టు (Guntur Court) కొట్టేసింది. సరైన సాక్ష్యాధారాలు లేవని.. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయిందని పేర్కొన్న జిల్లా ఐదో కోర్టు కేసు కొట్టేస్తూ శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. కాగా.. నాగార్జున వర్శిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. 2015, జులై 14న నాగార్జున వర్శిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. తన బలవన్మరణానికి ర్యాగింగ్, వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాసింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు లేఖలో పేర్కొంది. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించగా.. మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
9 ఏళ్ల పాటు విచారణ
రిషితేశ్వరి ఆత్మహత్య కేసును పెదకాకాని పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమె స్వస్థలం తెలంగాణలోని వరంగల్. గుంటూరు జిల్లా కోర్టులో ఈ కేసు తొమ్మిదేళ్ల పాటు విచారణ సాగింది. విచారణ అనంతరం శుక్రవారం న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాలు సమర్పించలేకపోయారంటూ కేసు కొట్టేసింది.
అయితే, ఈ తీర్పుపై రిషితేశ్వరి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'ఈ కేసులో 170 మంది సాక్షులు ఉన్నారు. మా అమ్మాయి రాసిన లెటర్ కూడా ప్రతీ అధికారికి అందించాం. వాటిని ఎందుకు ఈ కేసులో పరిగణలోకి తీసుకోలేదో మాకు అర్థం కావడం లేదు. మా బిడ్డ విషయంలో న్యాయం జరిగే వరకూ అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంను కలుస్తాం. మాకు పై కోర్టులకు వెళ్లి పోరాడే ఆర్థిక శక్తి లేదు. ప్రభుత్వమే మా అమ్మాయి కేసు విషయంలో సహాయం చేయాలి. మా బిడ్డ విషయంలో న్యాయం జరగకుంటే ఆత్మహత్యే మాకు శరణ్యం.' అంటూ వారు కన్నీళ్లు పెట్టుకున్నారు.