Godavari News: సిగరెట్లు తీసుకురాలేదని బాలుడిని డాబా పైనుంచి తోసేసిన వాలంటీర్, ఏం జరిగిందంటే?
Godavari News: సిగరెట్లు తీసుకురాలేడని బాలుడిని డాబా పైనుంచి తోసేశాడో గ్రామ వాలంటీర్. ఈ ఘటనలో బాలుడి కాళ్లు, చేతులు విరిగిపోగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Godavari News: తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఓ గ్రామ వాలంటీర్ దాష్టీకానికి ఓ బాలుడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రి పాలయ్యాడు. సిగరెట్లు తీసుకురమ్మంటే తీసుకు రాలేదని బాలుడిని డాబాపై నుంచి తోసేశాడో గ్రామ వాలంటీర్. దీంతో బాలుడి ఒక కాలు, చేయి విరిగి తీవ్ర గాయాలతో మంచాన పడ్డాడు. పది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కోరుకొండ మండలం కణుపూరు గ్రామానికి చెందిన 23 ఏళ్ల కల్యాణం సతీష్ గ్రామ వాలంటీరుగా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తల్లోజు శశిధర్ ఈ నెల 11న రోడ్డుపై వెళ్తుండగా ఆపి తనకు సిగరెట్లు తెచ్చి పెట్టమని కోరాడు. బాలుడు వినకుండా వెళ్లిపోయాడు. దీన్ని మనసులో పెట్టుకున్న వాలంటీర్ అదే రోజు రాత్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే గ్రామంలో బుర్ర కథ కార్యక్రమం జరుగుతుండగా బాలుడు శశిధర తో పాటు మరో బాలుడిని తన బైక్ పై బయటకు తీసుకెళ్లాడు. ఊళ్లో తిప్పుతూ... చివరగా ఊళ్లో సామిల్లు దగ్గర ఉన్న డాబా పైకి తీసు కువెళ్లాడు. అక్కడ అప్పటికే మద్యం సీసాలు, బజ్జీలు ఉన్నాయి. అక్కడకు వెళ్లగానే సతీష్ బాలుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'సిగరెట్లు తెమ్మంటే ఎందుకు తీసుకురాలేదు? నేనెవరో తెలుసా?" అంటూ శశిధర్ ను చావబాదాడు. కొట్టొద్దంటూ మరో బాలుడు ప్రాధేయ పడగా, ఇద్దరినీ కలిపి కొట్టాడు. ఇద్దరూ తప్పించుకోడానికి కిందికి దిగి వెళ్లిపోబోతుండగా శశిధర్ ను వెనుక నుంచి గట్టిగా తన్నడంతో డాబా పైనుంచి కిందకు పడిపోయాడు. కదల లేని స్థితిలో ఉన్న శశిధర్ ను ఇక్కడ జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. కొంతసేపటికి శశిధర్ ను తానే వాహనంపై కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకువెళ్లి దింపాడు.
గుడి మెట్లు ఎక్కుతుండగా కిందపడితే తీసుకువచ్చానని అతడి తల్లిని నమ్మించాడు. తీవ్ర గాయాలైన బాలుడిని తల్లిదండ్రులు మర్నాడు రాజమహేంద్రవరంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. గాయాలు తీవ్రంగా ఉండడంతో తగ్గలేదు. దీంతో మరో ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఎక్స్ రే లు తీసి అక్కడ శస్త్ర చికిత్స నిర్వహించారు.
జరిగిన విషయం తెలుసుకుని...!
బాలుడి తల్లి లక్ష్మి గురువారం రాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాలుడికి రెండు కాళ్లు, కుడిచేతికి తీవ్ర గాయాలు అయ్యాయని, ఒక కాలికి, చేతికి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చిందని తెలిపారు. లేవలేని పరిస్థితిలో ఉన్నాడని, ఆరు నెలల పాటు మంచం పైనే ఉంచి చికిత్స తీసుకోవాలని వైద్యులు తెలిపారన్నారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ మీనా స్పందించి శుక్రవారం సిబ్బంది ద్వారా వివరాలు సేకరించారు. వాలంటీరు గంజాయి, మద్యం తాగుతూ జులాయిగా తిరుగుతుంటాడని ఇంతకు ముందు కూడా అతడు గ్రామంలో పలువురిని బెదిరించిన ఘటనలు ఉన్నాయన్నారు. నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. ఈ కేసులో వాలంటీరు సతీష్ ను అరెస్టు చేశామని ఎస్ఐ శారదా సతీష్ తెలిపారు.