Nellore Excise Staff Transfer: గోవా మద్యం తెస్తోందెవరు ? ప్రభుత్వ దుకాణాల్లో అమ్ముతోందెవరు ? నెల్లూరులో విజిలెన్స్ వర్సెస్ సెబ్
గోవానుంచి తెచ్చిన మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న అంశం నెెల్లూరులో సంచలనం రేపుతోంది. సెబ్ అధికారులు ఈ విషయం చెబుతూంటే.. ఎక్సైజ్ శాఖ మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు.
నెల్లూరు జిల్లాలో 18వేల గోవా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మరుసటి రోజే మరో వెయ్యి బాటిళ్ల పాండిచ్చేరి లిక్కర్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలనుంచి మద్యాన్ని తీసుకొచ్చి మారుబేరానికి అమ్మడం, సొమ్ము చేసుకోవడం సహజమే అయినా.. గోవా లిక్కర్ వ్యవహారంలో స్వయానా ఎక్సైజ్ సిబ్బంది పాత్ర ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. గోవా నుంచి తక్కువ రేటుకి లిక్కర్ తీసుకొచ్చి, దాన్ని ఎక్కువ రేటుకి, ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనే అమ్ముతున్నారని ఎస్‌ఈబీ అధికారులు ప్రకటించారు. లిక్కర్ మాఫియాతో అధికారులు కుమ్మక్కు కావడం వల్లే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ దశలో ఎక్సైజ్ సిబ్బందిపై బదిలీ వేటు పడటం జిల్లాలో చర్చనీయాంశమైంది. మద్యం అక్రమ రవాణాని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎన్ ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్)ను ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ శాఖలోని 70 శాతం సిబ్బందితో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. స్వయంగా కేసులు నమోదు చేసే ప్రతిపత్తిని కూడా కల్పించారు. అయితే ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణను మాత్రం ఎక్సైజ్ శాఖకే అప్పగించారు ఉన్నతాధికారులు. డిపోల నుంచి మద్యం బాటిళ్ల దిగుమతి, రోజు వారీ బిజినెస్, నగదు లావాదేవీలు, దుకాణాల్లో సిబ్బంది, దుకాణాల నిర్వహణ వంటివన్నీ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కంట్రోల్ లోనే ఉంటాయి.
అందుకే నెల్లూరులో దొరికిన గోవా మద్యం అక్రమ అమ్మకాల్లో ఎక్సైజ్ శాఖ సిబ్బంది ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రకాశం జిల్లా విజిలెన్స్ అసిస్టెంట్ కమిషనర్ మూర్తితో ప్రభుత్వం విచారణ చేపట్టింది. జిల్లాలో ఆయన విచారణ చేపట్టి పలువురు సిబ్బంది అక్రమాలపై నివేదిక ఇచ్చారు. ఆయన నివేదిక ప్రకారం ఎక్సైజ్ లో విధులు నిర్వహిస్తున్న పలువురుని బదిలీ చేశారు. సంఘటన జరిగిన సమయంలోనే ఆత్మకూరు మండలంలోని ఎక్సైజ్ కానిస్టేబుల్ ను ఉదయగిరికి బదిలీ చేశారు. తాజాగా నెల్లూరు డిపో, ఓజిలి మధ్య కూడా బదిలీలు జరిగాయి.
గోవానుంచి తెచ్చిన మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నారనే విషయాన్ని సెబ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఎక్సైజ్ శాఖ మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. మరి గోవా మద్యాన్ని ఎక్కడ ఎవరు అమ్మారనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున ఇతర రాష్ట్రాల మద్యం పట్టుబడుతున్నా.. దాన్ని అమ్మేవారి విషయంలో మాత్రం క్లారిటీ లేదు. సెబ్ వర్సెస్ ఎక్సైజ్ అన్నట్టుగా మారింది పరిస్థితి. ఎక్సైజ్ సిబ్బందిపై బదిలీ వేటు పడటంతో ఈ సమస్య తీవ్రత తెలుస్తోంది.