Hyderabad Crime News: ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ దారుణ హత్య.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి
Hyderabad Latest News: ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ దారుణ హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధాలు నేపథ్యంలో చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హత్య వెలుగులోకి వచ్చింది.
Hyderabad Crime News : గత కొన్నాళ్లుగా రాజకీయ నాయకుల హత్యలు పెరుగుతున్నాయి. రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటుండడం, ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలతో రాజకీయ నాయకుల హత్యలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఘట్కేసర్ లో దారుణం చోటుచేసుకుంది. మాజీ ఎంపిటిసి గడ్డం మహేష్ (40)ను కొందరు దుండగులు హత్య చేశారు. ఈ హత్య వెనుక కూడా వివాహేతర సంబంధం కారణంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల కిందట మహేష్ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 17న కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కనిపించడానికి ముందు నుంచి మహేష్ ఎక్కడెక్కడికి వెళ్ళాడు.. ఎవరిని కలిశాడు అన్నదానిపై వివరాలు సేకరించిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురిని తమదైన శైలిలో పోలీసులు విచారించగా గడ్డం మహేష్ ను హత్య చేసుకున్నట్లు ఒప్పుకున్నారు. జెసిబి సాయంతో ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో కారును పాతిపెట్టినట్లు పోలీసులకు వెల్లడించారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహం కోసం డంపింగ్ యార్డ్ లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గడ్డం మహేష్ హత్యకు వివాహేతర సంబంధం కారణంగా తెలుస్తోంది. ఈ కోణంలోనే పోలీసులు విచారణ సాగించి కేసును చేదించినట్లు చెబుతున్నారు. అయితే హత్యకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. పోలీసులు వివరాలను వెల్లడిస్తామని చెబుతున్నారు.
అత్యంత దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారణ
మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో సంచలన విషయాలను పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు. మహేష్ ను అత్యంత కిరాతకంగా దుండగులు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మహేష్ ను రూములో బంధించారు. ఈ క్రమంలోనే చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది. కళ్ళల్లో కారం చల్లడంతోపాటు పారతో తలపై దాడి చేశారు. దీంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నెల 17వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహేష్ తిరిగి రాలేదు దీంతో అతని సోదరుడు విఠల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఎఫ్సీ నగర్ డంపింగ్ యార్డ్ వద్ద ఎన్ఎఫ్సి నగర్ డంపింగ్ యార్డులో మహేష్ మృతదేహం లభ్యమయింది. మృతదేహానికి స్థానిక ఎమ్మార్వో పంచనామా చేశారు. అనంతరం డంపింగ్ యార్డ్ వద్ద వైద్యులు పోస్టుమార్టం చేశారు. కళ్ళల్లో కారం చల్లి పారతో తలపై దాడి చేయడంతో మహేష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎంపీటీసీ మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున డంపియార్డుకు స్థానికులు తరలివచ్చారు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, విచారణలో భాగంగా పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు.