Hyderabad: హైదరాబాద్‌లో దొంగల ముఠా అరెస్ట్! కిలోల కొద్దీ బంగారం స్వాధీనం
Gold Thieves : రాచకొండ పరిధిలో బంగారం దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 1,832 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad : రాచకొండ పరిధిలో బంగారం దొంగల ముఠాను పోలీసులు (Telangana Police) అరెస్ట్ చేశారు. ఈ ముఠా రాత్రుళ్లు ట్రావెల్స్ బస్సుల్లో దోపిడీలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటుంది. ఇలా దోపిడీ చేసిన బంగారంతో పరారవుతుండగా రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరు హుందాయ్ క్రెటా కార్లో పారిపోతుండగా చౌటుప్పల్ వద్ద రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 1,832 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు ఒక కోటీ 26 లక్షల 88 వేల 432 రూపాయల వరకు ఉంటుందని అంచనా
టీ తాగేందుకు పోతే తాపీగా పని కానిచ్చేశారు
ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ... ఏడీ జ్యువెలర్స్ కు చెందిన బంగారు ఆభరణాలను అందులో పని చేసే ఉద్యోగి పురోహి భరత్ కుమార్ , ఒక బ్రాంచ్ నుండి మరొక బ్రాంచ్ కు ఆరెంజ్ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేట్ బస్సులో తరలిస్తున్నారు. ప్రయాణం మధ్యలో చౌటుప్పల్ వద్ద టీ తాగడానికి కిందికి దిగే సమయంలో నగలు ఉన్న అతని బ్యాగును దొంగిలించారు. విషయం గమనించిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు టీములు గా ఏర్పడి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలించారు. మొత్తం ముగ్గురు సభ్యులు ఉన్న ఈ ముఠాలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోని ఠాకూర్ అనే ఒక నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 1832 గ్రాములు బంగారు నగలు స్వాధీనం చేసుకుని నిందితుని రిమాండ్ తరలించారు.
పరారీలో మరో ఇద్దరు
దాదాపు కోటి 26 లక్షల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు ట్రావెల్స్ బస్సులను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి దొంగలను అరెస్ట్ చేశామన్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులను టార్గెట్ చేసుకొని దొంగతనం చేస్తున్నారన్నారు. పక్కా సమాచారం బస్సులో వెళ్తున్న బంగారు ఆభరణలను దొంగిలిస్తారన్నారు. ఏ -3 సోనూ టాగూర్ మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పారు. మరో ఇద్దరు ఏ1, ఏ2 పరారీ లో ఉన్నారన్నారు. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నట్లు త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు.
రూ.2.51కోట్ల బంగారం స్వాధీనం
హైదరాబాద్ నగర సమీపంలోని చౌటుప్పల్ - పతంజలి టోల్ ప్లాజా వద్ద విదేశీయుల నుంచి రూ.2.51 కోట్ల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి కారులో వస్తున్న ముగ్గురు వ్యక్తులు కర్ణాటకలోని బీదర్‌కు వెళ్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. బుధవారం పతంజలి టోల్ ప్లాజా వద్ద కారు తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న బంగారం బయటపడింది. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించారు. హ్యాండ్ బ్రేక్‌కు దిగువన ఉన్న సీక్రెట్ లాకర్, క్లచ్ పక్క బ్రౌన్ కవర్లలో చుట్టి ఉన్న బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం 3577 గ్రాములు కాగా దీని విలువ రూ.2,51,46,310 అని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.