Road Accidents: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు - చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు, మరో ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
Siricilla News: తెలంగాణలో ఒకే రోజు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. స్కూల్ బస్సు కింద పడి ఓ చిన్నారి మృతి చెందిన తీవ్ర విషాద ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.
Child Died By Hitting Bus In Siricilla: ఆ చిన్నారి ప్రతి రోజూలాగే ఉత్సాహంగా స్కూలుకు బయలుదేరింది. పుస్తకాల బ్యాగు భుజాన వేసుకుని తన కుటుంబ సభ్యులకు బాయ్ చెప్తూ 'అమ్మా వెళ్లొస్తా' అంటూ స్కూల్ బస్సు ఎక్కింది. ఇంతలోనే ప్రమాదం రూపంలో మృత్యువు ఆ చిన్నారిని కబళించింది. ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తీవ్ర విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Siricilla) చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన రాజు, వెంకటలక్ష్మి దంపతులకు గత కొన్నేళ్లుగా పిల్లలు లేరు. దీంతో వీరు మనోజ్ఞ (5) అనే చిన్నారిని పెంచుకుంటున్నారు. ఉపాధి నిమిత్తం రాజు సౌదీ వెళ్లగా.. వెంకటలక్ష్మి కుమార్తెను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. ప్రతిరోజూలానే కుమార్తెను సోమవారం కూడా వెంకటలక్ష్మి కుమార్తెను స్కూలుకు పంపింది.
బస్సు టైరు కింద పడి..
మనోజ్ఞ (5) పాఠశాలలోని తరగతి గదికి వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న ఓ బస్సు వెనుక టైర్ల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సద్దిచెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేలిన ప్రైవేట్ బస్సు టైర్
అటు, జనగామ జిల్లాలో (Janagam District) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ బస్సు బోల్తా పడి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ మండలం యశ్వంత్‌పూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై రన్నింగ్‌లోనే టైరు పేలి ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. బెంగుళూరు నుంచి వరంగల్ వైపునకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. 23 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బస్సు బోల్తాతో భారీగా ట్రాఫిక్ జాం కావడంతో సహాయక చర్యలు చేపట్టారు.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
అలాగే, హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి చెందిన క్యాబ్ డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో సాయితేజ అనే ఉద్యోగి మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ వద్ద మరో ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని నీలయరెడ్డి అనే వైద్యుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డివైడర్‌ను బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Crime News: బజ్జీల కోసం దారుణం - అరువు ఇవ్వలేదని వేడి నూనె పోసేశాడు, ఎక్కడంటే?