12 ఏళ్ల బాలికను గదిలో బంధించి చిత్రహింసలు, సిగరెట్‌లతో కాల్చుతూ రాక్షసానందం
Nagpur Crime: నాగ్‌పూర్‌లో ఓ కుటుంబం బాలికను గదిలో బంధించి చిత్ర హింసలకు గురి చేసింది.
Nagpur Crime:
నాగ్‌పూర్‌లో బాలికపై దారుణం..
నాగ్‌పూర్‌లో 12 ఏళ్ల బాలికను గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టింది ఓ కుటుంబం. చీకట్లో పడేసి తీవ్రంగా కొట్టింది. ఇంట్లో పని చేసేందుకు వచ్చిన బాలికకు ఇలా నరకం చూపించారు. సిగరెట్లతో ఒళ్లంతా కాల్చారు. స్థానికుల్లో వణుకు పుట్టించింది ఈ ఘటన. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...నాగ్‌పూర్‌లోని అధర్వ నగరి సొసైటీలో ఓ కుటుంబం 12 ఏళ్ల బాలికను ఇంట్లో పనిలో పెట్టుకుంది. బెంగళూరు నుంచి రప్పించుకుని మరీ ఇంట్లో ఉంచుకుంది. కొద్ది రోజులు బాగానే గడిచినా ఆ తరవాత కుటుంబ సభ్యులు ఆమెను వేధించడం మొదలు పెట్టారు. గంటెలు వేడి చేసి కాల్చేవారు. సిగరెట్‌లతోనూ ఎక్కడ పడితే అక్కడ గాయపరిచేవారు. గిన్నెల్ని కాల్చి వాటితోనూ వాతలు పెట్టారు. ప్రైవేట్ పార్ట్స్‌పైనా తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు నాలుగు రోజులుగా ఇంట్లోని ఓ గదిలో బంధించి ఇలా హింసించారు. ఆ తరవాత ఇంటికి తాళం వేసి బెంగళూరుకి వెళ్లిపోయారు. పొరుగింటి వాళ్లు బాలిక గదిలో ఉండడాన్ని గుర్తించారు. గట్టిగా ఏడుపులు వినిపించే సరికి వెంటనే అక్కడికి వెళ్లారు. బాలిక పరిస్థితి అర్థం చేసుకుని కిటికీ బద్దలు కొట్టి బయటకు తీసుకొచ్చారు. ఆకలితో అలమటిస్తున్న బాధితురాలికి అన్నం పెట్టారు. నీళ్లు తాగించారు. ఆమె పరిస్థితి చూసి స్థానికులు చలించిపోయారు. కరెంట్ బిల్ కట్టకపోవడం వల్ల ఆ ఇంటికి పవర్ కనెక్షన్ కట్ చేశారు అధికారులు. ఫలితంగా నాలుగు రోజులుగా అదే గదిలో చీకట్లో మగ్గిపోయింది బాలిక. బయటకు తీసుకొచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నారు. తన కూతురిని చదివిస్తామని చెప్పి తీసుకెళ్లారని, ఇంత దారుణంగా హింసిస్తారని అనుకోలేదని బాధితురాలి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
రష్యాలోనూ ఇదే తరహా దారుణం..
రష్యాలో 14 ఏళ్ల పాటు ఓ అమ్మాయిని గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లలో ఆమెను తీవ్రంగా కొట్టడమే కాకుండా దాదాపు వెయ్యి సార్లు అత్యాచారం చేసినట్టు బాధితురాలు పోలీసులకు వెల్లడించింది. నిందితుడు వ్లాదిమిర్ చెస్కిడోవ్ మరి కొంత మహిళలనూ ఇలాగే టార్చర్ చేశాడని విచారణలో తేలింది. 19 ఏళ్ల వయసులో బాధితురాలు చెస్కిడోవ్ ఇంటికి నీళ్లు తాగేందుకు వెళ్లింది. అప్పుడే ఆమెని లోబరుచుకుని గదిలో బంధించాడు. అప్పటి నుంచి దారుణంగా హింసిస్తున్నాడు. ఈ నిందితుడికి తల్లి కూడా సహకరించింది. ఇద్దరూ కలిసి ఆమెను వేధించారు. ఇన్నేళ్లకు ఎలాగోలా ఆ ఇంట్లో నుంచి తప్పించుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చింది బాధితురాలు. ఈ ఫిర్యాదు ఆధారంగా నిందితుడితో పాటు అతడి 72 ఏళ్ల తల్లినీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు కీలక వివరాలు వెల్లడించింది బాధితురాలు. 2009లో బస్‌డిపోలో ఉండగా నిందితుడు చెస్కిడోవ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తరవాత ఇద్దరూ స్నేహితులయ్యారు. డ్రింక్స్ పార్టీ ఉందని చెప్పి అమ్మాయిని ఆహ్వానించాడు నిందితుడు. ఇంట్లోకి వచ్చిన వెంటనే కత్తితో బెదిరించి గదిలో కట్టేశాడు. బెడ్‌రూమ్‌లో బంధించాడు.
Also Read: పెళ్లి చేసుకోవాలని మొండికేసిన ప్రియురాలు, తాడుతో ఉరి వేసి చంపిన ప్రియుడు