Fake E-challan Scam: ఈ-చలానా మెసేజ్ మీకూ వచ్చిందా.? - బీ అలర్ట్, అప్రమత్తంగా లేకుంటే డబ్బు మాయం
E-Challan Frauds in Hyderabad: సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలతో డబ్బు దోచేస్తున్నారు. ప్రస్తుతం ఫేక్ ఈ - చలానాల పేరుతో మెసేజెస్ పంపించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. జాబ్స్, లాటరీ, పెట్టుబడులు, గిఫ్ట్స్ పేరిట మోసాలకు పాల్పడ్డ నిందితులు ఇప్పుడు ప్రజల డబ్బు దోచుకునేందుకు కొత్త అవతారం ఎత్తారు. తాజాగా, ట్రాఫిక్ పోలీసులమంటూ ఫేక్ చలానాలు మెసేజ్ ల రూపంలో పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. చలానాలపై 50 శాతం తగ్గింపు అంటూ ఆకర్షిస్తుండగా, నిజమేనని నమ్మిన చాలా మంది రూ.లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి సందేశాలు, ఫేక్ లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు.
మోసం ఇలా
నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు వాహన యజమాని నెంబర్లకు చలానా వివరాలు సందేశాలుగా వస్తాయి. దీన్నే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. e-Challan పేరుతో ఫేక్ మెసేజెస్ పెట్టి సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. డబ్బు కట్టేందుకు లింక్ క్లిక్ చేయాలని చెబుతారు. సదరు లింక్ పై ఎవరైనా క్లిక్ చేస్తే మొబైల్ వ్యక్తిగత సమాచారం సహా మొత్తం డేటా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది.
ఫేక్ యాప్స్ సైతం
అలాంటి లింక్స్ పై క్లిక్ చేస్తే మొబైల్ హ్యాక్ కావడం సహా కొన్ని యాప్స్ కూడా తెలియకుండా డౌన్ లోడ్ అయిపోతాయి. తద్వారా సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకుని డబ్బంతా దోచేసే అవకాశం ఉంది. కొన్నిసార్లు మొబైల్ లోని ఫోటోలు, వ్యక్తిగత వివరాలు సేకరించి బెదిరించి మరీ డబ్బు కొట్టేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వారికి డేటా ఎలా.?
సైబర్ నేరగాళ్లకు వాహనాల యజమానులకు సంబంధించిన సమాచారం, ఫోన్ నెంబర్లు ఎలా వెళ్తున్నాయనేది ఓ ప్రశ్నగా మారింది. అయితే, కొన్ని ప్రైవేట్ సంస్థల్లో భద్రతా వ్యవస్థలు సరిగ్గా లేకపోవడం, ఉద్యోగుల పొరపాట్లతో డేటా బయటకు వెళ్తుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ మందికి సొంత వాహనాలు ఉన్నందున ఒకేసారి అందిరికీ బల్క్ గా సందేశాలు, ఫేక్ లింక్స్ పంపిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
ఫిర్యాదు చేయండిలా
నకిలీ ఈ - చలానాల పేరుతో వచ్చిన మెసేజ్ లను నమ్మి డబ్బు పోగొట్టుకున్న వారు 1930 టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద నకిలీ మెసేజ్ లు వస్తే, వాటిని ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 8712672222 కు పంపి కంప్లైంట్ చేయాలని స్పష్టం చేశారు.
నకిలీలను గుర్తించండిలా
పట్టణాల్లో ఎవరైనా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే వారికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చలానా మెసేజ్ వస్తుంది. అలా కాకుండా ఎవరికైనా ఫేక్ మెసేజ్ వచ్చినట్లు అనిపిస్తే పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని 'ఈ-చలానా' వెబ్ సైట్ లో తనిఖీ చేసుకోవాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అక్కడ ఉంటే అందులోనే నగదు చెల్లించొచ్చని పేర్కొంటున్నారు. ఫేక్ లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తింపు లేని యాప్స్ డౌన్ లోడ్ చేసుకోకూడదని సూచిస్తున్నారు.