(Source: ECI/ABP News/ABP Majha)
G.Kottapalli Ysrcp Clash : గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణం : మృతుడి భార్య ఆరోపణలు
G.Kottapalli Ysrcp Clash : ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ ను దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో ఎమ్మెల్యే హస్తం ఉందని బాధితుడి భార్య ఆరోపించింది.
G.Kottapalli Ysrcp Clash : ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మృతుడు గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం ఉదయం జి.కొత్తపల్లికి వెళ్లారు. వైసీపీ నేత హత్యలో ఎమ్మెల్యే పాత్ర ఉందని కొందరు ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యేపై కార్యకర్తలంతా మూకుమ్ముడిగా దాడికి పాల్పడ్డారు. సుమారు మూడు గంటలకు పైగా ఎమ్మెల్యేను స్థానికులు నిర్భందించారు. ఆయనపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. అయితే గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ కారణమని మృతుడి భార్య ఆరోపిస్తుంది.
నా భర్త హత్యకు ఎమ్మెల్యేనే కారణం : బాధితుడి భార్య
తన భర్త హత్యకు ఎమ్మెల్యే వెంకట్రావు కారణమని గంజి ప్రసాద్ భార్య సత్యవతి ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఎంపీటీసీ బజారియా, అతని అనుచరులు తన భర్తను హత్య చేశారన్నారు. హోంమంత్రి వనితకు తన భర్త గంజి ప్రసాద్ అనుచరుడు అని ఆమె అన్నారు. ఎమ్మెల్యే వెంకట్రావే హత్య చేయించారన్నారు. తమకు న్యాయం జరిగే వరకూ గంజి ప్రసాద్ మృతదేహాన్ని తరలించబోమని సత్యవతి అంటున్నారు.
"నా భర్త హత్యకు ఎస్సై, ఎమ్మెల్యే వెంకట్రావు కారణం. ఈ హత్యను ఆ నలుగురితో చేయించారు. నా భర్తను హత్య చేసిన వాళ్లను ఇక్కడికి తీసుకురావాలి. అప్పటి వరకూ ఇక్కడ నుంచి కదలేదిలేదు. ఎస్సై, ఎమ్మెల్యే పథకం ప్రకారం ఎంపీటీసీ, అతని అనుచరులతో హత్య చేయించారు." అని మృతుడు గంజి ప్రసాద్ భార్య సత్యవతి అంటున్నారు.
టీడీపీ నేతలే నాపై దాడి చేశారు : ఎమ్మెల్యే తలారి
తనపై జరిగిన దాడిపై ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "జి.కొత్తపల్లిలో వైసీపీలోనే రెండు వర్గాలు ఉన్నాయి. ఆ గ్రామంలో టీడీపీ వాళ్లు పోటీ చేయరు. పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వైసీపీ వాళ్లే రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేశారు. అయితే గంజి ప్రసాద్, బజారియా వర్గాల మధ్య ఎప్పటి నుంచో మనస్పర్థలు ఉన్నాయి. ఇవాళ ఉదయం గంజి ప్రసాద్ హత్య గురించి తెలిసి జి.కొత్తపల్లి వెళ్లాను. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాను. అయితే అక్కడికి కొందరు కొత్త వాళ్లు వచ్చారు. వాళ్లను ఎప్పుడూ చూడలేదు. అందరూ చుట్టుముట్టడంతో పోలీసులు నన్ను పాఠశాలలో ఉంచి రక్షణ కల్పించారు. నాపై దాడికి టీడీపీ వాళ్లే కారణం. టీడీపీ వాళ్లు రెచ్చగొట్టడం వల్లే రాద్ధాంతం జరిగింది. " అని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు.
"జి.కొత్తపల్లిలో రెండు వర్గాలు ఉన్నాయి. రెండు వర్గాలు కూడా నాకు సపోర్ట్ గా ఉంటాయి. రెండు వర్గాలను సమన్వయం చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టి నా పై దాడి చేయించారు. " - ఎమ్మెల్యే తలారి వెంకట్రావు