Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Kasthuri Remand: తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరికి ఎగ్మోర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆమెను పోలీసులు పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు.
Egmore Court Remad To Actress Kasthuri: తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో సినీ నటి కస్తూరికి (Actress Kasthuri) కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 29 వరకూ 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదివారం ఎగ్మోర్ కోర్టు (Egmore Court) ఆదేశాలు జారీ చేసింది. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసుల బృందం ఆమెను హైదరాబాద్ గచ్చిబౌలిలో శనివారం అరెస్ట్ చేసింది. అనంతరం ఆదివారం చెన్నైలోనే కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలో ఆమెను పోలీసులు చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు.
#WATCH | Actress Kasthuri Shankar who was arrested by the special team in Hyderabad yesterday was taken from Chintadripet Police Station to Chief Metropolitan Magistrate Court, Egmore.
— ANI (@ANI) November 17, 2024
Kasthuri was booked by Chennai Police for allegedly passing derogatory comments against the… pic.twitter.com/1X07zu5rDJ
కాగా, బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో ఈ నెల 4న నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న కస్తూరి తెలుగువారిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అంతఃపురంలో సేవ చేసేందుకు వచ్చిన తెలుగువాళ్లు ఇప్పుడు తామే అసలైన తమిళులం అనేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలుగు మాట్లాడే వాళ్లకే మంత్రి పదవులు ఇస్తున్నారని అసలైన తమిళులను పట్టించుకోవడం లేదన్నారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. దీనిపై పలు తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. చెన్నై ఎగ్మోర్‌లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు నటి కస్తూరి ప్రకటించారు. తాను కొందరి గురించే మాట్లాడానని వివరణ ఇచ్చారు. తెలుగు స్నేహితులు ఒకరు తనకు పరిణామాలు వివరించారని పూర్తి విషయం తెలుసుకున్న తర్వాత ఇలా స్పందిస్తున్నట్టు వెల్లడించారు.
దేశంలోని భిన్నత్వంలో ఏకత్వంపై తనకు చాలా గౌరవం ఉందని.. తాను జాతి ప్రాంతాలకు అతీతంగా ఉంటానని కస్తూరి అన్నారు. ఈ సందర్భంగా తెలుగు వారితో తనకున్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. కొందరి గురించి చేసిన కామెంట్స్‌ను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఎవర్నీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తమిళనాడులోని బ్రాహ్మణుల పోరాటంలో పాలు పంచుకోవాలని తెలుగు వారికి విజ్ఞప్తి చేశారు. అయితే, కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు యత్నించినా ఆమె అందుబాటులో లేరు. ఫోన్ సైతం స్విచ్చాఫ్ అని రావడంతో పరారీలో ఉన్నట్లు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో చెన్నై పోలీస్ బృందం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.