East Godavari News: పోలీస్‌స్టేషన్‌లో కొట్టుకున్న ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్... ఇద్దర్ని వీఆర్‌కు పంపిన ఎస్పీ.. తరచూ రచ్చకెక్కుతున్న ఖాకీలు
భద్రత కల్పించాల్సిన కొందరు పోలీసులే బాధ్యత మరిచి ప్రవరిస్తున్నారు. దాడి చేసుకుంటున్నారు. హత్యలు చేస్తున్నారు. పని ఒత్తిడో, వ్యక్తిగత కారణాలో కానీ ఖాకీల వ్యవహారం మాత్రం తరచూ రచ్చకెక్కుతోంది.
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం గ్రామీణ పోలీసు స్టేషన్‌లో గురువారం ఓ ఘటన చోటుచేసుకుంది. ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్ ఎస్సై సమక్షంలోనే బూతులు తిట్టుకుంటూ దాడి చేసుకున్నారు. స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తోన్న హెడ్ కానిస్టేబుల్ జనార్దనరావును ఓ కేసుకు సంబంధించిన వివరాలు పెన్‌డ్రైవ్‌లో లోడ్ చేసి, ప్రింట్ తీసి ఇవ్వాలని ఏఎస్సై తిరుమలరావు కోరారు. పెన్‌డ్రైవ్‌లో వైరస్ ఉందని, సమాచారం లోడ్ చేసి ప్రింట్ తీయడం ఆలస్యమవుతోందని హెడ్ కానిస్టేబుల్ సమాధానం ఇచ్చారు. దీంతో ఇద్దరికి తగాదా మొదలైంది. ఇద్దరూ కొట్లాటకు దిగారు. ఏఎస్సైకి చెవిపైన, హెడ్ కానిస్టేబుల్‌కు ఛాతీపైనా స్వల్ప గాయాలయినట్లు తెలుస్తోంది. పిఠాపురం గ్రామీణ ఎస్సై జగన్మోహనరావు ఈ ఘటనను సీఐ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇద్దరిపైనా కేసు నమోదు చేసి ఎస్పీకి రిపోర్టు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ... ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
వివాహేతర సంబంధం...హత్యకు కారణం
వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. విజయవాడలో చోటుచేసుకోగా ఈ ఘటనలో నిందితుడు ఏపీ డీజీపీ వ్యక్తిగత గన్ మెన్. విజయవాడ సిటీ ఆర్మడ్ రిజర్వు విభాగంలో శివనాగరాజు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. పటమట స్టేషన్ పరిధిలోని రామలింగేశ్వర నగర్‌లోని పుట్టరోడ్డులో అద్దెకు ఇళ్లు తీసుకుని భార్య, పిల్లలతో ఉంటున్నాడు. ఆ ఇంటిపైన ఉన్న పెంట్ హౌస్‌లో వెంకటేష్(24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే కానిస్టేబుల్ భార్యతో వెంకటేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ శివనాగరాజు భార్యను మందలించాడు. వెంకటేష్‌తో ఇల్లు ఖాళీ చేయించాడు. అయినా వెంకటేష్ అప్పుడప్పుడు వస్తూ వెళ్తుండేవాడు. ఈ విషయంపై కానిస్టేబుల్ తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఇటీవల వెంకటేష్ విజయవాడకు రాగా భర్త లేని సమయంలో అతన్ని ఇంటికి రమ్మని కానిస్టేబుల్ భార్య పిలిచింది. వెంకటేష్ కానిస్టేబుల్ ఇంటికి రావడానికి స్థానికులు గుర్తించి అతనికి సమాచారం అందించారు. ఆవేశంతో అక్కడకి వచ్చిన కానిస్టేబుల్ వెంకటేష్ చేతులు, కాళ్లు కొట్టేసి విచక్షణా రహితంగా దాడిచేశాడు. దీంతో వెంకటేష్ మృతి చెందాడు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
గుట్కా వీడియో బయటపెట్టాడని హత్య
ఇటీవల కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఘటన పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. ఓ యూట్యూబ్ ఛానల్ విలేకరిగా పనిచేస్తున్న కేశవ్ (32)ను నంద్యాల టూటౌన్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తోన్న ఓ కానిస్టేబుల్, అతడి సోదరుడు హత్య చేశారు. స్క్రూ డ్రైవర్‌తో కేశవ్‌ను ఎనిమిది సార్లు పొడిచి దారుణానికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ గుట్కా లావాదేవీలకు సంబంధించిన ఓ వీడియో విలేకరి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడమే ఇందుకు ప్రధాన కారణమని సమాచారం.
Also Read: Gnt Death : ఎక్సైజ్ పోలీసుల దాడిలో యువకుడి మృతి ఆరోపణలు.. గుంటూరు జిల్లాలో రాజకీయ కలకలం..!