East Godavari: డబ్బులు తీసుకుని సారా పట్టుకుంటావా?... కానిస్టేబుల్ పై సారా వ్యాపారుల దాడి... వీడియో విడుదల చేసిన పోలీసులు
మా దగ్గర ప్రతి నెల డబ్బులు తీసుకుంటూ ఇప్పుడెందుకు సరుకు పట్టుకున్నావని సారా వ్యాపారులు రెచ్చిపోయారు. తనిఖీలకు వచ్చిన పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లాలో సారా వ్యాపారులు రెచ్చిపోయారు. సారా తరలిస్తున్న పడవను అడ్డుకోవడంతో పోలీసులపై దాడికి దిగారు. ఓ కానిస్టేబుల్ విచక్షణారహితంగా కొట్టారు. కానిస్టేబుల్ తమ వద్ద ప్రతి నెల డబ్బులు తీసుకునేవాడని సారా వ్యాపారులు ఆరోపించారు. ఈ నెల 27న ఆలమూరు మండలం జిల్లెలపేట వద్ద పోలీసులపై జరిగిన దాడి ఆలస్యంగా వెలుగు చూసింది. సారా వ్యాపారులు దాడి వీడియోను పోలీసులు భయటపెట్టారు. ఆలమూరు మండలంలో గోదావరి నదిలో పడవ పై సారా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు పోలీసులపై తిరగబడ్డారు.
ఈ ఘటనలో కానిస్టేబుల్, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించి ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోదావరిలో పడవపై సారా తరలింపు సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మా దగ్గర డబ్బులు తీసుకుని పడవ ఎందుకు ఆపారంటూ పోలీసులపై ఎదురుదాడికి దిగారు సారా వ్యాపారులు. కానిస్టేబుల్ శ్రీనివాసరావు తరచు తమ వద్ద డబ్బులు వసూలు చేసి తిరిగి ద్రోహం చేస్తున్నాడని దాడికి తెగబడ్డ సారా వ్యాపారులు ఆరోపించారు. రాజోలు ఎక్సైజ్ (ఎస్ఈబీ) పోలీసులు నాటు సారా డ్రమ్ములు ఉన్న పడవులను ఆపడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు
తూర్పుగోదావరి జిల్లాలో నాటుసారా వ్యాపారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆలమూరు మండలంలోని జిల్లెళ్లపేట వద్ద నాటుసారా కేంద్రంపై దాడి చేసేందుకు వెళ్లిన ఎస్‌ఈబీ పోలీసులపై నాటు సారా వ్యాపారులు గురువారం మధ్యాహ్నం ఎదురు దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి. ఆలమూరు శివారులోని జిల్లెళ్లపేట వద్ద గోదావరి నదిలో నాటుసారా తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో రాజోలు ఎస్‌ఈబీ ఎస్‌ఐ రఘు, కానిస్టేబుళ్లు నానాజీ, వాసంశెట్టి శ్రీనివాసుడు తనిఖీలకు వెళ్లారు. వారిని గమనించిన ఆరుగురు సారా వ్యాపారులు పోలీసులపై దాడి చేయగా శ్రీనివాసుడు తీవ్రంగా గాయపడ్డాడు. కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడిని ఎస్‌ఈబీ అడిషనల్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాస్, మండపేట రూరల్ సీఐ శివగణేష్, ఆలమూరు ఎస్‌ఐ ఎస్.శివప్రసాద్ పరామర్శించారు. ఆలమూరు ఎస్‌ఐ శివప్రసాద్ ఈ దాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కానిస్టేబుల్ పై సారా వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.