(Source: ECI/ABP News/ABP Majha)
East Godavari News : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం, కెమికల్ ట్యాంకర్ పేలి ముగ్గురు మృతి
East Godavari News : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ కెమికల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ పేలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
East Godavari News : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో భారీ పేలుడు సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ కెమికల్ ట్యాంకర్ పేలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఒక్కసారిగా పేలుడు సంభవించి, మంటలు వ్యాపించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో విజన్ డ్రగ్స్ ఫ్యాక్టరీ సిబ్బంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తూర్పు గోదావరి జిల్లా అధికారులను ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాద కారణాలపై విచారణ జరుపుతామని తెలిపారు. కార్మికుల మృతదేహాలను పోలీసులు కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టమ్ అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాద కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు.
వరుస ప్రమాదాలు
ప్రాథమిక దర్యాప్తులో కొన్ని ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. ఇటీవల వరుసగా పలు పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. నెల రోజుల క్రితం కాకినాడలోని ఓ షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఐదుగురు కార్మికులు మరణించారు. నాలుగు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగి ముగ్గురు చనిపోయారు. తాజాగా ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వివిధ పరిశ్రమల్లో భద్రత మీద యంత్రాంగం దృష్టి సారించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ విజన్ డ్రగ్ పరిశ్రమ వద్ద తోటి కార్మికులు ఆందోళన చేస్తున్నారు.
ప్రైవేట్ బస్సులో అగ్ని ప్రమాదం
నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి ఓ ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేసి.. ప్రయాణికులందరినీ కిందకు దింపేశాడు. దీని వల్లే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. కానీ బస్సు, అందులో ఉన్న సామాన్లన్నీ పూర్తిగా కాలిపోయాయి. అయితే ప్రమాద సమయంలో బస్సులో 29 మంది మంది ప్రయాణికులు ఉన్నారు. పూజా ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు నాగ్ పూర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తోంది. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే హుటాహటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఫైర్ ఇంజిన్లతో వచ్చిన అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులో షాట్ సర్క్యూట్ జరగడం వల్లే మంటలు చెలరేగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రయాణికులంతా క్షమేంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మంటలు చెలరేగిన క్రమంలో ప్రయాణికులు బయటకు దిగే కంగారులో చాలా మంది తమ వస్తువులను బస్సులోనే వదిలివేయడంతో అవన్నీ కూడా కాలి బూడిద అయ్యాయి. బ్యాగుల్లో దాచుకున్న నగదు, బంగారం, దుస్తులు, ఇతర వస్తువులు కాలిపోయినట్లు పలువురు ప్రయాణికులు చెప్పారు.