East Godavari Crime : ఇంటి ముందే యువకుడిపై కత్తులతో దాడి, హత్య దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు
East Godavari Crime : తూర్పుగోదావరి జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఆదివారం తెల్లవారుజామున యువకుడి ఇంటికి వచ్చిన కొందరు గొడవపడి కత్తులతో దాడి చేశారు.
East Godavari Crime : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో దారుణ హత్య జరిగింది. అనపర్తి మండలం కొమరిపాలెంలో చిన్న అనే 24 ఏళ్ల యువకుడిని ఇంటి వద్దే కత్తులతో పొడిచి చంపారు. ఆదివారం తెల్లవారుజామున చిన్న ఇంటికి వచ్చిన కొందరు యువకులు అతడితో గొడవపడ్డారు. అనంతరం చిన్నపై కత్తులపై దాడి చేసి హత్య చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ బుచ్చిబాబు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హత్య దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
అసలేం జరిగింది?
న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొమరిపాలెంలో ఓ కుటుంబ సభ్యుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు కొందరు యువకులు. ఆదివారం తెల్లవారుజామును 3 గంటల సమయంలో యువకుడి ఇంటికి వచ్చిన ఓ యువతి కొందరు యువకులు అతడితో వాగ్వాదానికి దిగారు. యువకులు అతడిపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. యువకుడి హత్య గ్రామంలో సంచలనం అయింది. ఈ హత్య దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ముందు గొడవపడడం తర్వాత పక్కనుంచి ఓ యువకుడు కత్తితో పొడవడం సీసీ కెమెరాల్లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. రక్తపు ధారాలతో పరుగున ఇంటి వద్దకు వచ్చిన యువకుడు ఇంటి ముందే కుప్పకూలిపోయాడు. పాతకక్షల వివాదంతో యువకుడిని ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కబడ్డీ ఆడుతూ యువకుడు మృతి
నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు కొన్నిచోట్ల పరుగు పందెలు, ఎడ్ల పందెలు, కబడ్డీ, సింగింగ్ కాంపిటీషన్ ఇలా తోచిన విధంగా ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు. విజయనగరం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి నెలకొంది. పూసపాటిరేగ మండలం వెంపడం గ్రామంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహించేలా ప్లాన్ చేశారు. చుట్టుపక్కల గ్రామాల జట్లు సైతం కబడ్డీ పోటీలో పాల్గొన్నాయి. కొవ్వాడ, ఎరుకొండ, యోరుకొండ, అగ్రహారం గ్రామాల జట్లు పాల్గొన్నాయి. కొవ్వాడ - ఎరుకొండ జట్లు కబడ్డీ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో తలపడ్డాయి. ఈ క్రమంలో ఎరుకొండ గ్రామానికి చెందిన రమణ అనే యువకుడు కబడ్డీ ఆడుతూ ఒక్కసారిగా కింద పడిపోయాడు. రమణ తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్త స్రావమైనట్లు కొందరు చెబుతుండగా.. ఇంటర్నల్ గా ఏదో జరిగిందని మరికొందరు స్థానికులు తెలిపారు. కబడ్డీ పోటీల నిర్వాహకులు, స్థానికులు చికిత్స నిమిత్తం రమణను విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. కానీ డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూనే రమణ మృతి చెందాడు. తమ కుమారుడు చనిపోవడంతో రమణ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
భీమిలీ కబడ్డీ సినిమా తరహాలో యువకుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. కొవ్వాడ, ఎరుకొండ జట్లు కబడ్డీ టోర్నీ ఫైనల్ చేరుకున్నాయి. ఫైనల్ ఆడుతుండగా కొందరు ఆటగాళ్లు అందరూ ఒక్కసారిగా రమణ మీద పడిపోయారు. దీంతో యువకుడు ఊపిరాడక అపస్మారక స్థితికి వెళ్లాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన కుమారుడు చనిపోయాడని, దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. రూ.500 బెట్టింగ్ వేసి మ్యాచ్‌లు నిర్వహించారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆటలో ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడాన్ని స్థానికులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.