Siricilla News: భార్యపై కోపంతో ఇంటినే తగులబెట్టాడు - సిరిసిల్ల జిల్లాలో ఘటన
Telangana News: ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యతో గొడవ పడి ఆమెతో పాటు ఇంట్లోనూ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా.. భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.
Drunken Man Set Fire To His Wife And His House: మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యతో గొడవపడ్డాడు. చిన్న ఘర్షణ పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు భర్త.. భార్యపై ఇంట్లోనూ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో భార్యాభర్తలు స్వల్ప గాయాలతో బయటపడగా.. ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌లో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనగర్‌కు చెందిన ముడారి బాలపోశయ్య అనే మత్స్యకారుడు ఇంటి వద్ద చేపలు అమ్ముతూ భార్య రాజేశ్వరితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం బయటకు వెళ్లిన పోశయ్య బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అనంతరం భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి కోపంతో భార్యపై, ఇంట్లో కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
స్థానికుల సమాచారంతో..
ఇంట్లో మంటలు అంటుకోగా.. భార్య కేకలు వేస్తూ ఇంటి వెనుక నుంచి బయటకు వచ్చేసింది. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. మంటలకు ఇంట్లోని సామాగ్రి అంతా దగ్ధమైంది. ఇంటి బయట ఉన్న ద్విచక్రవాహనం సైతం దగ్ధమైంది. భార్యాభర్తలకు స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.