AP Crime News: ఏపీలో దారుణాలు - భార్యను నరికి చంపిన భర్త, ఆస్తి కోసం అత్తను కిడ్నాప్ చేయించిన కోడలు
Andhra Pradesh News: ఏపీలో దారుణాలు వెలుగుచూశాయి. నంద్యాల జిల్లాలో ఓ భర్త మద్యం మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపేశాడు. అటు, అన్నమయ్య జిల్లాలో ఓ కోడలు ఆస్తి కోసం అత్తనే కిడ్నాప్ చేయించింది.
Husband Kills His Wife In Nandyal: ఏపీలో దారుణాలు చోటు చేసుకున్నాయి. ఓ చోట మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ భర్త. మరో చోట చిన్న కోడలు ఆస్తి కోసం అత్తనే కిడ్నాప్ చేయించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లెలో మద్యం మత్తులో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే గొడ్డలితో నరికి చంపాడు. గ్రామానికి చెందిన వడ్డే రమణ, సుగుణమ్మ భార్యాభర్తలు. చాలాకాలంగా రమణ తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. శనివారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపం పెంచుకున్న రమణ నిద్రిస్తున్న భార్యను ఆదివారం తెల్లవారుజామున గొడ్డలితో నరికి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొలిమిగుండ్ల సీఐ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ఆస్తి కోసం అత్త కిడ్నాప్
అటు, ఆస్తి కోసం ఓ కోడలు తన అత్తనే కిడ్నాప్ చేయించి చిత్రహింసలు పెట్టించిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. రాజంపేట పట్టణంలోని మున్నూరులో ఆస్తి కోసం అత్త లక్ష్మి నరసమ్మను ఆమె చిన్న కోడలు తన బంధువులతో కిడ్నాప్ చేయించింది. కువైట్‌లో ఉన్న కొడుకుకు సీఐడీ పోలీసుల పేరిట బెదిరింపులకు కూడా చేయించింది. వారం రోజుల క్రితం అత్త లక్ష్మినరసమ్మను కిడ్నాప్ చేయించి రాయచోటికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టింది. తన ఆస్తిని బలవంతంగా వారి పేరిట ఉన్న పేపర్లలో వేలిముద్రలు వేసుకుని లాక్కున్నారని అత్త తెలిపింది. బంగారం, సెల్ ఫోన్ దౌర్జన్యంగా లాక్కొని తనను కిడ్నాపర్లు వదిలేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోడలిపై చర్యలు తీసుకుని తనను రక్షించాలని వేడుకుంది. అత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.