Crime News : సోషల్ మీడియాలో కనిపించే "సమస్యలు పరిష్కరించే బాబా"ను సంప్రదించాడు - 38 లక్షలు పోగొట్టుకున్నాడు !
సర్పదోషం పేరుతో భయపెట్టి 38 లక్షలు వసూలు చేశారు దొంగబాబా ముఠా. పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు.
Crime News : అతను బైక్ మీద వెళ్తూండగా స్కిడ్ అయి పడ్డాడు. దానికి కారణం రాయో లేకపోతే డ్రైవింగ్ బ్యాలెన్స్ చేయలేకపోవడమో కారణం. కానీ పడిన వ్యక్తికి ఇంకేదో అనిపించింది. అలా అనిపించినదుకు అతనికి 38 లక్షలు చార్జ్ అయింది. అతనికి ఏమనిపించిందంటే.. తాను ఊరకనే కిందపడలేదని.. దానికేదో కారణం ఉంటుందని అనుకోవడమే. అలా అనుకుని దొంగ బాబా దగ్గరకు వెళ్లడమే. దీంతో ఆ బాబా ముఠా.. మరింత భయపెట్టి ఉన్నదంతా ఊడ్చేసింది.
బైక్ యాక్సిడెంట్ జరిగితే సర్పదోషం అని భయపెట్టిన దొంగ బాబా
భువనగిరి కి చెందిన కొండల్ రెడ్డి ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. కొద్ది రోజుల కిందట ఆయన బండి మీద వెళ్తూండగా కింద పడ్డాడు. గాయాలయ్యాయి. చికిత్స తీసుకుని ఇంటికొచ్చాడు.కానీ అతనికి తాను కింద పడటానికి ఏదో కారణం ఉందనుకుని ఓ బాబాను సంప్రదించాడు. ఆ బాబా రాజస్తాన్‌లోని సీరోహి అనే ప్రాంతం నుంచి వచ్చాడు. బాగా మాయ మాటలు నేర్చాడు. ఓ ముఠాను కూడా తయారు చేశాడు. తనకేదో జరిగిందని భయపడుతున్న కొండల్ రెడ్డిని మరింత భయపెట్టాడు. సర్పదోషం ఉందన్నాడు. తక్షణం సర్పదోష నివారణ చేయకపోతే చనిపోతావని భయపెట్టారు. అటూ ఇటూ చూసే చాన్స్ కూడా ఇవ్వకుండా సర్పదోష నివారణ పేరతో లక్షలు గుంజారు.
పూజల పేరుతో 38 లక్షలు వసూలు
ప్రాణభయంతో ఎక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చి వారు అడిగినంతా ఇస్తూ వచ్చాడు కొండల్ రెడ్డి. అలా 37 లక్షల 71 వేలు వసూలు చేసిన తర్వాత కొండల్ రెడ్డికి డౌట్ వచ్చింది. ఇంత డబ్బులు తీసుకుని ఏమీ చేయకపోవడం.. ఇంకా ఇంకా డబ్బులు తీసుకు రావాలని అడుగుతూండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం అర్థమైన పోలీసులు వెంటనే దొంగ బాబాతో పాటు అతని అనుచరుల్నిఅరెస్ట్ చేశారు. అయితే కొండల్ రెడ్డి దగ్గర వసూలు చేసిన సొమ్మునుచాలా వరకూ తరలించేశాడు. నగదు 8 లక్షలు, కౌంటింగ్ మిషన్, రుద్రాక్ష మాలలు మాత్రం దొరికాయి.
చివరికి మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు
సోషల్ మీడియాలో.. లోకల్ మీడియాలో బాబా ప్రకటనలు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంటాయి. వశీకరణం అని ఓ బాబా అంటాడు.. ఫ్యామిలీ సమస్యలు పరిష్కరిస్తామని మరో బాబా అంటాడు... కుబేరుడ్ని చేస్తామని మరో బాబా అంటాడు. వాళ్లను నమ్మి వెళ్లి నట్టేట మునిగిపోతారని తెలిసినా చాలా మంది వెళ్తూంటారు. మోసానికి గురవుతూ ఉంటారు. ఇలాంటి బాబాల దగ్గరకు వెళ్లవద్దని పోలీసులు ఎన్ని సార్లు అవగాహన కల్పించినా నేరాలు మాత్రం ఆగడం లేదు.