Uttar Pradesh: కాలువలోని దూసుకెళ్లిన వాహనం.. 11 మంది భక్తుల దుర్మరణం
UP Crime News | ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు భక్తులతో వెళ్తున్న ఓ వాహనం కాలువలో పడిపోవడంతో 11 మంది మరణించారు.

Devotees Killed In UP: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు భక్తులతో వెళ్తున్న ఓ వాహనం కాలువలో పడిపోవడంతో 11 మంది మరణించారు. జిల్లాలోని పృథ్వీనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేయడానికి 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న SUV వాహనం ప్రమాదానికి గురైంది. నలుగురు భక్తులను స్థానికులు కాపాడారు.
దిగ్భాంతి వ్యక్తం చేసిన సీఎం యోగి
ఘటనపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
‘గోండా జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం. హృదయ విదారకం. దుఃఖంలో మునిగిపోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అని సీఎం యోగీ ఆదిథ్యనాథ్ X లో ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను కూడా ఆయన ప్రకటించారు.
డ్రైవర్‌తో సహా నలుగురిని రక్షించిన అధికారులు
సీఎం ఆదేశాలతో హుటాహుటిన ఘటనా ప్రదేశానికి చేరుకున్న జిల్లా అధికారులు గాయపడిన వారిని వెంటనే సరైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. SUV డ్రైవర్‌తో సహా నలుగురిని సజీవంగా రక్షించారు. వైద్య చికిత్స కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపినట్లు గోండా పోలీసు సూపరింటెండెంట్ వినీత్ జైస్వాల్ తెలిపారు.
‘సమాచారం అందిన వెంటనే, స్థానిక గ్రామస్తులు, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. డ్రైవర్‌తో సహా నలుగురిని సజీవంగా రక్షించారు. 11 మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. సజీవంగా ఉన్న నలుగురిని సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేస్తున్నారు’ అని ఎస్పీ తెలిపారు.





















