Crime News : మహిళా ఐఏఎస్ ఇంట్లోకి చొరబడిన డిప్యూటీ తహశీల్దార్ సస్పెన్షన్ - పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం !
మహిళా ఐఏఎస్ ఇంట్లోకి చొరబడిన డిప్యూటీ తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఆయనను పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.
Crime News : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఆనంద్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.కలెక్టర్ ఆదేశాలను చంచల్ గూడ జైలులో నిందితుడికి అందిస్తారు.
సంచలనం రేపిన ఘటన
తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్... హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే ఆమె చేసిన ట్వీట్లకు ఓ డిప్యూటీ తహసీల్దార్ ఒకరి రెండు సార్లు రీట్వీట్లు చేశారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో కారులో నేరుగా ఆమె ఉండే నివాస సముదాయానికి వెళ్లాడు. తన స్నేహితుడైన హోటల్ యజమానిని అతని వెంటతీసుకెళ్లాడు. తాను ఫలానా క్వార్టర్ కు వెళ్లాలని కాపలా సిబ్బందికి జంకు లేకుండా చెప్పడంతో అనుమానించని వారు లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. స్నేహితుడిని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్ మాత్రం ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ముందు ఉన్న స్లైడింగ్ డోర్ ను తెరుచుకొని లోపలికి ప్రవేశించి గది తలుపు కొట్టాడు. డోర్ తెలిచిన మహిళా ఐఏఎస్ కు అంత రాత్రి సమయంలో ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో తీవ్రంగా భయపడిపోయారు. తేరుకున్న ఆమె, నువ్వెవరు, ఎందుకొచ్చావని అని గట్టిగా ప్రశ్నించింది. అందుకు అతను గతంలో నేను మీకు ట్వీట్ చేశానని.. తన ఉద్యోగం గురించి మాట్లేందుకు వచ్చానని సమాధానం చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహానికి గుర్తైన ఆమె బయటకి వెళ్లాలని చెబుతూ కేకలు వేసినట్లు సమాచారం. ఈలోపే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కారును జప్తు చేసిన పోలీసులు.. డిప్యూటీ తహసీల్దార్ తో పాటు అతడి స్నేహితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
ఆందోళన వ్యక్తం చేసిన స్మితా సబర్వాల్
ఈ ఘటనపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి ఊహించని సంఘటన ఎదురైంది. అత్యంత బాధాకరమైన ఘటన జరిగిందన్నారు. రాత్రి ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు.. అప్రమత్తతో నా ప్రాణాలు కాపాడుకున్న.. మీ ఇంటికి తాళాలు వేసుకోండి... తలుపు తాళాలను తనిఖీ చేసుకోండి.. అత్యవసర పరిస్థితిలో డయల్ 100కు కాల్ చేయండని ప్రజలకు సలహా ఇచ్చారు.
ఆనంద్ కుమార్ రెడ్డిని కస్టడీకి తీసుకునే అవకాశం !
నిందితుడు పక్కాప్లాన్‌తోనే వచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఉద్యోగం విషయం మాట్లాడటానికి వచ్చానని చెబుతున్నారు. అయితే ఉద్యోగం విషయం మాట్లాడాలంటే పగలు రావాలిగానీ రాత్రి ఎందుకు వచ్చారు అన్నది సస్పెన్స్ గా మారింది. నిందితుడు ఉన్నత విద్యావంతుడు. ఎమ్మెస్సీ మ్యాథ్స్, లా, జర్నలిజం చదివి ఢిల్లీలో పలు పత్రికల్లో పని చేశారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుంటేనే పూర్తి వివరాలు వెలుగుచూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.