మొబైల్ దొంగిలించారని బట్టలూడదీసి మూకదాడి, చేతులు కట్టేసి కొట్టిన స్థానికులు - వైరల్ వీడియో
Delhi Crime: మొబైల్ దొంగిలించారన్న అనుమానంతో ఢిల్లీలో ముగ్గురిపై మూకదాడి చేశారు.
Delhi Crime News:
ఢిల్లీలో దారుణం..
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మొబైల్ దొంగిలించారన్న అనుమానంతో ముగ్గురిపై కొందరు మూక దాడి చేశారు. అక్కడితో ఆగకుండా బట్టలు విప్పించి రోడ్డుపై నగ్నంగా తిప్పారు. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో ఈ దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. పాతికేళ్ల వయసున్న ముగ్గురు యువకుల్ని రోడ్డుపైనే నగ్నంగా తిప్పుతూ కొట్టారని స్థానికులు చెప్పారు. ఆ ముగ్గురి చుట్టూ కనీసం 30-35 మంది ఉన్నట్టు పోలీసులకు వివరించారు. చేతులు కట్టేసి ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పారు. ఈ దాడి తరవాత ముగ్గురు బాధితులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. వాళ్ల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిని తట్టుకోలేక వాళ్ల నుంచి తప్పించుకున్నట్టు వివరించారు. తమకు సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లామని, కానీ అక్కడ ఎవరూ లేరని తెలిపారు. అయినా...స్థానికుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఆ బాధితులు నిజంగానే మొబైల్ దొంగిలించారా లేదా అన్న కోణంలోనూ విచారణ చేపడుతున్నట్టు తెలిపారు.