Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులు హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైకి జ్యూడిషియల్ కస్టడీ విధించింది స్పెషల్ కోర్టు. 14 రోజుల పాటు అధికారులు ఆయనను తీహార్ జైలులో విచారించనున్నారు.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లైకి స్పెషల్ కోర్టు 14 రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీని విధించింది. సోమవారంతో అరుణ్ పిళ్లై కస్టడీ ముగియనుండగా.. అధికారులు ఆయనను స్పెషల్ కోర్టులో హాజరు పరిచారు. దీంతో పిళ్లైకి ఏప్రిల్ 3వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించింది న్యాయస్థానం. అలాగే కస్టడీలో ఉన్నన్ని రోజులు పిళ్లైకు అవసరమైన మందులు సమకూర్చాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరగా న్యాయస్థానం అందుకు అంగీకరించింది. పిళ్లైకి థైరాయిడ్ మెడిసిన్, ఐ డ్రాప్స్, బట్టలు అందించాలని అధికారులను స్పెషల్ కోర్టు ఆదేశించింది.
కవితకు బినామీ అరుణ్ పిళ్లై!
హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీగా ఈడీ పేర్కొంటూ వస్తోంది. ఆప్ నేతలకు వంద కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్ గ్రూపు గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్ సంస్థలో ఎమ్మెల్సీ కవిత తరఫున అరుణ్ భాగస్వామిగా ఉన్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంటోంది. ఈ మొత్తం వ్యవహారంలో నేరపూరిత ఆర్జన రూ.296 కోట్లు ఉండొచ్చని ఈడీ ఆరోపిస్తోంది. ఇందులో కొంత మొత్తాన్ని అరుణ్ పిళ్లై స్థిర, చరాస్తుల కొనుగోలుకు ఉపయోగించినట్లు పేర్కొంది.
సౌత్ గ్రూపు, ఆప్ నేతల మధ్య రాజకీయ ఒప్పందం కుదర్చడానికి అరుణ్ పిళ్లై, అతని అనుచరులు వివిధ వ్యక్తులతో కలిసి వ్యవహారం నడిపినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఆప్ నేతలకు ముడుపులు ముట్టజెప్పి, ఆ మొత్తాన్ని మద్యం వ్యాపారం ద్వారా తిరిగి రాబట్టుకోవడం అరుణ్ పిళ్లై కీలకమైన వ్యక్తి అని ఈడీ పేర్కొంటుంది. ఎల్1 లైసెన్స్ పొంది ఇండోస్పిరిట్స్ సంస్థలో అరుణ్ పిళ్లైకి 32.5శాతం, ప్రేమ్ రాహుల్ కు 32.5శాతం, ఇండోస్పిరిట్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ కు 35 శాతం వాటా ఉంది. ఇందులో కె.కవిత బినామీగా అరుణ్ పిళ్లై, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ మాగుంటా ఉన్నారని ఈడీ చెబుతోంది. ఇండోస్పిరిట్స్ సంస్థలో తాము కవిత ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అరుణ్ పిళ్లైతో పాటు, మరో వ్యక్తి తమ వాంగ్మూలాల్లో అంగీకరించినట్లు ఈడీ అధికారులు చెబుతూ వస్తున్నారు.
కవిత సూచనల మేరకే!
కాగితాల్లో ఉన్న లెక్కల ప్రకారం అరుణ్ పిళ్లై ఇండోస్పిరిట్స్ లో రూ.3.40 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. అందులో రూ. కోటి కవిత సూచనల మేరకు అతనికి ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఢిల్లీలో 9 రిటైల్ జోన్లను నియంత్రణలో ఉంచుకున్న మాగుంట అగ్రోఫామ్స్ ప్రై.లి, ట్రైడెంట్ క్యాంఫర్ లిమిటెడ్, ఆర్గానోమిక్స్ ఎకోసిస్టమ్స్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్, ఖావో గాలీ రెస్టారెంట్స్ ప్రై.లి లు సిండికేట్ గా ఏర్పడటంలో అరుణ్ పిళ్లై కీలకభూమిక పోషించారు.
ఆప్ నేతలకు ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపులను మద్యం వ్యాపారం ద్వారా తిరిగి రాబట్టుకునేందుకు గాను ఈ సిండికేట్ ఏర్పాటు జరిగింది. ఇందుకోసం ఆప్ నేతల ప్రతినిధి విజయ్ నాయర్, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయిన్ పల్లి, మరికొందరు హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ సూట్ రూములో మీటింగ్ నిర్వహించారని ఈడీ అధికారులు వెల్లడించారు.