Rodney Alcala Died: 130 మందిని అత్యాచారం చేసిన ఆ రాక్షసుడు కన్నుమూత!
130 మంది మహిళలను అత్యాచారం చేసినట్లు ఆరోపణ. అత్యాచారం చేయడమే కాదు తర్వాత హత్య చేసి ఆ మహిళల చెవి పోగులు దాచుకుంటాడు. ఆయనే అమెరికా నరరూపరాక్షసుడుగా అందరూ అనుకునే రోడ్నీ అల్కాలా. ఆయన ఇటీవల మరణించాడు.
అమెరికా ఊపిరి పీల్చుకుంది.. ఎందరో మహిళలను అతికిరాతకంగా అత్యాచారం చేసి చంపిన ఓ నరరూప రాక్షసుడు చనిపోయాడు. ఆ ఘటనలు తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. అయితే ఆ బాధిత మహిళల మృతదేహాలు కూడా ఇప్పటికీ లభ్యం కాకపోవడం ఆశ్చర్యమే. అసలు అతను ఎవరు? ఏం చేశాడు? అమెరికాను ఉలిక్కిపడేలా చేసిన ఆ రాక్షసుడి కథేంటి?
తలచుకుంటేనే..
మహిళలను పాశవికంగా అత్యాచారం చేస్తాడు. ఆ తర్వాత సుత్తితో చావబాదుతూ రాక్షసానందం పొందుతాడు. చావుకు, బతుక్కి మధ్య ప్రాణాలు కొట్టుమిట్టాడుతుండగా కాసేపు వదిలేస్తాడు. కాస్త స్పృహలోకి వచ్చాక మళ్లీ ఘోరంగా దాడి చేసి చంపుతాడు. తర్వాత బాధితురాళ్ల చెవి పోగులను తీసుకుని ఇంట్లో దాచుకుంటాడు. ఇలా ఎంతో మంది మహిళలను చిత్రవధ చేసి చంపిన నరరూప రాక్షసుడు, అమెరికాలో 'ది డేటింగ్ గేమ్ కిల్లర్' (Dating Game Killer)గా పేరుపొందిన రోడ్నీ జేమ్స్ అల్కాలా(77) మరణించాడు.
ఫొటోలు తీసే అలవాటు...
మరణశిక్ష కోసం ఎదురుచూస్తూ కాలిఫోర్నియాలోని కొర్కోరన్ జైలులో ఉన్న అల్కాలా సహజ కారణాలతో తుది శ్వాస విడిచినట్లు అధికారులు తెలిపారు. ఏడుగురు మహిళల హత్య కేసుల్లో అతడిపై నేరం రుజువైనా, వాస్తవానికి తన చేతిలో 130 మందికి పైగా హతమై ఉండొచ్చని అధికారులు విశ్వసిస్తున్నారు. 1968లో 8 ఏళ్ల బాలికపై, 1974లో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన అల్కాలా.. 1978లో 'ది డేటింగ్ గేమ్' టీవీ షోలో పోటీదారుగా పాల్గొన్నాడు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడే ముందు ఫొటోలు తీసే అలవాటున్న అల్కాలా..
ఆ షోలో విన్నర్..
ఆ షోలో తనను ఫొటోగ్రాఫర్‌గా పరిచయం చేసుకున్నాడు. అందులో విజేతగానూ నిలిచాడు. ఈ షోతోనే అతడికి 'ది డేటింగ్ గేమ్ కిల్లర్' అని పేరొచ్చింది. 1979లో రాబిన్ సామ్సో అనే 12 ఏళ్ల బాలికను హత్య చేసిన కేసులో అల్కాలాకు 1980లో మరణశిక్ష పడింది. కానీ నాలుగేళ్లకు రద్దైంది. 2010లో డీఎన్‌ఏ సాయంతో అతడిపై నేరాన్ని రుజువు చేయడంతో మరణశిక్ష ఖరారైంది. అదే ఏడాది మరో నలుగురు మహిళల హత్య కేసులోనూ మరణశిక్ష పడింది. 2013లో మరో ఇద్దరు మహిళల హత్య కేసు రుజువు కావడంతో 25 ఏళ్ల కారాగార శిక్షను విధించారు. అల్కాలా దాచుకున్న బాధితురాళ్ల చెవిపోగులు అతడి నేరాలను రుజువు చేయడంలో కీలకంగా మారాయి. అతడి ఇంటిలో ఉన్న 100కు పైగా మహిళల ఫొటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. అందులో చాలా మంది ఆచూకీ లభ్యం కాలేదు.