Drugs in Hyderabad: న్యూ ఇయర్ కోసం హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్.. గుట్టు రట్టు చేసిన పోలీసులు, పలువురు అరెస్టు
మాదాపూర్‌లో సైబరాబాద్ పోలీసులు ఈ మాదక ద్రవ్యాల ముఠా గుట్టును రట్టు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించారు.
ఇంకొద్ది రోజుల్లో కొత్త సంవత్సర వేడుకలు ఉన్నందున హైదరాబాద్‌లో డ్రగ్స్ మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఆ వేడుకల్లో మత్తులో తేలేందుకు అవసరమైన డ్రగ్స్ భారీగా హైదరాబాద్‌కు అక్రమ మార్గాల్లో గుట్టుగా చేరుకుంటోంది. ఈ క్రమంలో పోలీసులు ముందస్తుగా అప్రమత్తమై చేసిన తనిఖీల్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. మాదాపూర్‌లో సైబరాబాద్ పోలీసులు ఈ మాదక ద్రవ్యాల ముఠా గుట్టును రట్టు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి మహమ్మద్ అష్రాఫ్ బేగ్, రామేశ్వర శ్రవణ్ కుమార్, చరణ్ తేజ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. ప్రస్తుతం ఇందులో ప్రధాన నిందితుడు జూడ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వీరి నుంచి మొత్తం 183 గ్రాముల కొకైన్, 44 ఎండీ ఎస్టేసీ ట్యాబ్లెట్‌ను స్వాధీనం చేసుకున్నామని కమిషనర్ వెల్లడించారు. మొత్తం 26 లక్షల 28 వేల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. నైజీరియాకు చెందిన జూడ్ అనే వ్యక్తి ద్వారా ముఠా సభ్యులు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని తెలిపారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా గోవా నుంచి భారీగా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు సరఫరా చేయిస్తున్నట్లుగా తమ విచారణలో తేలిందని కమిషనర్ చెప్పారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్‌కు డిమాండ్ బాగా ఉంటుందని, సరకును తెప్పించి ముఠా సభ్యులు హైదరాబాద్‌లో వివిధ వ్యక్తులకు అమ్ముతున్నారని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2021లో సైబరాబాద్ పరిధిలో 202 కేసులు నమోదు కాగా.. 419 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. పదే పదే డ్రగ్స్‌తో పట్టుబడుతున్న 23 మంది వ్యక్తులపై పీడీ చట్టాన్ని నమోదు చేశామని తెలిపారు.
SOT Madhapur Police has apprehended (03) accused Persons who are dealing with Cocaine drug powder form, and seized 183 Grms Cocaine Drug, 44 No’s of MD Ecstasy Tablets, all worth of the seized drug of Rs. 26,28,000/-.https://t.co/E6SLf9eIDK
— Cyberabad Police (@cyberabadpolice) December 23, 2021
Also Read: New Year 2022: తెలంగాణలో న్యూఇయర్, క్రిస్మస్ వేడులపై ఆంక్షలు పెట్టాల్సిందే.. హైకోర్టు ఆదేశాలు
Also Read: Rajanna Sircilla: తెలంగాణలో ఒమిక్రాన్ దడ.. ఈ ప్రాంతంలో ప్రజలంతా కలిసి సెల్ఫ్ లాక్‌డౌన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి