Cyber Crime Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన సైబర్ దొంగలు.. రెండు ఘటనలు కోట్ల రూపాయల మోసం
Cyber Fraud In Hyderabad : సైబర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. హైదరాబాద్‌లో రెండు ఘరానా మోసాలు జరిగాయి. పోలీసు అధికారినంటూ రిటైర్డ్ ఉద్యోగిని వ్యాపారవేత్తను మోసం చేశారు.
Cyber Crime:``సైబర్(Cyber) నేరాల కట్డడి తలకు మించిన భారంగా మారింది. భవిష్యత్తులో దీనిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి`` అని.. ఆర్బీఐ(RBI) గవర్నర్ పదవి నుంచి రిటైర్ అయిన శక్తికాంత దాస్(Shaktikanta Das) తన చిట్ట చివరి ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇది నిజమే. నేరుగా వచ్చి దొంగతనం చేసేవారు.. సీసీ కెమెరాల్లో అయినా.. చిక్కుతారేమో.. కానీ, సైబర్ ముఠా మాత్రం ఎవరికీ అంతుచిక్కని రీతిలో మోసాలకు పాల్పడుతుండడం అందరికీ పెను సవాలుగా మారింది. ఒకవైపు పోలీసులకు ఈ కేసులు సవాలుగా మారుతుండగా.. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి.. కోట్ల కొద్దీ సొమ్మును పోగొట్టుకుంటున్న బాధితులు మరోవైపు.. ఇబ్బుందులు పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన రెండు ఘటనలు.. అందరినీ విస్మయానికి గురి చేశారు.
4.8 కోట్ల రూపాయలకు టోపీ!
హైదరాబాద్(Hyderabad)కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త మాదిరెడ్డి శ్రీనగేష్(66)ను పక్కాగా మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ అసెట్ మేనేజ్‌మెంట్ (FTAM)కు చెందిన ప్రతినిధులమంటూ పరిచయం చేసుకున్న సైబర్ నేరస్తుల వలలో ఆయన చిక్కుకుని ఏకంగా 4.8 కోట్లు మోసపోయారు. దీనిపై ఆయన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(TGCSB)కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనగేష్ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. ఆయన ఈ ఏడాది అక్టోబర్‌లో 'FTAM' వాట్సాప్ గ్రూప్‌లో చేరారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు.. తాము FTAM కస్టమర్ సర్వీస్ ఏజెంట్లుగా పరిచయం చేసుకున్నారు. శ్రీనగేష్‌ను 'VIP ఎలైట్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్' అనే మరో గ్రూప్‌కు పరిచయం చేశారు. మీరా దత్ సహా మరొకొందరు అందులో పరిచయం అయ్యారు. అధిక రిటర్న్‌లు వస్తాయన్న ఆశలు చూపి.. రెండు నెలల్లో నగేష్ నుంచి రూ. 4.8 కోట్లు పెట్టుబడి పెట్టించారు. ఫండ్ ట్రాన్స్‌ఫర్‌ల కోసం మోసగాళ్లు తరచూ బ్యాంకు ఖాతాలను మార్చారు. అంతేకాదు.. యాప్ కూడా డీ యాక్టివేట్ అయిపోయింది. దీంతో మోసపోయానని గ్రహించిన నగేష్.. పోలీసులను ఆశ్రయించారు. కాగా.. తాను పెట్టుబడుల కోసం రుణాలు తీసుకున్నానని.. ఇప్పుడు వాటిని చెల్లించేందుకు రూ.8 కోట్లు బకాయి పడ్డానని వివరించారు.
పోలీసు అధికారుల పేర్లతో..
మరో కేసులోనూ సైబర్ నేరస్తులు 12 లక్షల రూపాయలను దోచుకున్నారు. ఇక్కడ మరీ చిత్రంగా ``మీపై కేసు నమోదైందని, ఈ కేసు నుంచి బయట పడాలంటే.. సొమ్ములు కట్టాలని`` చెప్పి భయ పెట్టి మోసాలకు పాల్పడ్డారు. విషయంలోకి వెళ్తే ఇటీవల ముంబై(Mumbai)కి చెందిన ఐపీఎస్(IPS) అధికారుల పేర్లతో పలు మోసాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌పై కన్నేశారు. తాము ఐపీఎస్ అధికారుల మని పేర్కొంటూ.. భయభ్రాంతులకు గురి చేసి.. సొమ్ములు గుంజుతున్నారు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన తాజా కేసులో ఐపీఎస్ నవజ్యోత్ సిమి పేరును `సైనీ`గా పేర్కొంటూ.. 70 ఏళ్ల రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.12 లక్షల రూపాయలను దోచుకున్నారు. అయితే.. ఆయన కూడా ఫోన్‌లో వ్యక్తులు చెప్పిన విషయాలను నమ్మేసి నగదు బదిలీ చేయడం మరింత విడ్డూరంగా ఉంది.
ఏం జరిగింది?
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్(Khairatabad)కు చెందిన 70 ఏళ్ల వ్యక్తి.. ప్రస్తుతం ఉద్యోగ విరమణ(Retired) చెంది విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. ఈ పోన్‌లో ఓ యువతి మాట్లాడుతూ.. తాను ఐపీఎస్ అధికారి `సైనీ` అని పరిచయం చేసుకుంది. గతంలో బీహార్, ఇప్పుడు కర్ణాటకలో పని చేస్తున్నట్టు తెలిపింది. అయితే.. సదరు వృద్ధుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సమయంలో మొత్తం రూ. 6 కోట్ల మోసంలో 10శాతం మాజీ ప్రభుత్వ ఉద్యోగికి 'కమీషన్'గా ఇచ్చినట్లు అంగీకరించినట్లు అతనికి చెప్పింది. మనీలాండరింగ్ చట్టం కింద అరెస్టు చేస్తామని బెదిరించారు. దీంతో కంగారు పడిన సదరు మాజీ ఉద్యోగి.. ఇప్పుడు ఏం చేయాలని ప్రశ్నించగా.. ఈ కేసు నుంచి బయట పడేసేందుకు 12 లక్షలు ఇస్తే సరిపోతుందని.. ఇక ఎలాంటి కేసు ఉండదని చెప్పింది. అంతేకాదు.. ఈ కేసులో నిర్దోషిగా తేలితే.. సదరు 12 లక్షలను తిరిగి ఇస్తామని పేర్కొంది. సొమ్ములు రాగానే అరెస్టు వారెంటును క్లియర్ చేస్తామని కూడా చెప్పింది.
ఆమె చెప్పింది నిజమేనని నమ్మిన మాజీ ఉద్యోగి.. సదరు మొత్తాన్ని బదిలీ చేశారు. అయితే.. ఈ కేసులో కూడా ఆధారాలను ధృవీకరించకుండానే బాధితుడు డబ్బును బదిలీ చేశారు. కానీ ఆ మొత్తాన్ని బదిలీ చేసిన తర్వాత, మోసగాళ్లు అతని కాల్‌లకు స్పందించడం మానేశారు. అంతేకాదు.. నంబర్‌ను కూడా బ్లాక్ చేశారు. దీంతో తాను మోసపోయానని రిటైర్డ్ ఉద్యోగికి అర్థమైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. రిటైర్డ్ ఉద్యోగి బదిలీ చేసిన మొత్తం ఏ ఖాతాలోకి చేరిందో గుర్తించారు. అది పంజాబ్‌లోని లూథియానాలో ఉన్న బ్యాంకు ఖాతాగా గుర్తించారు. అయితే.. ఇది నకిలీ ఖాతా లేదా మ్యూల్ ఖాతా కావచ్చునని పోలీసులు తెలిపారు. ఇలాంటి వాటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Also Read: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం