Crime News: భర్త, కూతుళ్ల సాయంతో యువకుడికి మహిళ వలపు వల, రూ.4లక్షలు కాజేసిన కిలేడీ
విశాఖకు చెందిన వివాహిత పెళ్లి పేరుతో యువకుడికి మోసం చేసింది. వధువుగా పరిచయం చేసుకుని అందినకాడికి గుంజుకుంది. అతని నుంచి 4లక్షల రూపాయలు కాజేసింది. భర్త, కూతుళ్ల సాయంతోనే యువకుడిపై వలపు వల విసిరింది.
Married woman cheated young man:
ఆమెకు పెళ్లయ్యింది. భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయినా... పెళ్లికాని ప్రసాద్‌కు వల వేసింది. మాటలతో మభ్యపెట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి. ఏడాది పాటు పరిచయం పెంచుకుని అతనిలో ఆశలు రేపింది. అప్పుడప్పుడు డబ్బులు కూడా గుంజుకుంది. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి... జారుకుంది. ఇబ్బంది పెట్టొద్దని ఎదురుతిరిగింది. మోసపోయానని తెలుసుకున్న యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు కూపీ లాగారు... కిలేడీ గుట్టు విప్పారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన యువకుడు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలో పేరు నమోదు చేసుకున్నాడు. ఆ సైట్‌లో నుంచి యువకుడి నెంబర్ తీసుకుంది విశాఖ చెందిన స్వాతి. యువకుడికి ఫోన్ చేసి... వధువుగా పరిచయం చేసుకుంది. యువకుడి వివరాలు తెలుసుకుంది. నెమ్మదిగా పరిచయం పెంచుకుంది. యువకుడు తనను ఇష్టం పడేలా చేసుకుంది. రోజూ గంటలు గంటలు అతనితో మాట్లాడింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు యువకుడు. తనను బాగా నమ్మాడని గ్రహించిన కిలేడీ... అతని దగ్గర అందిన కాడికి దోచుకునేందుకు స్కెచ్ వేసింది. రోడ్డుప్రమాదంలో గాయపడ్డానంటూ మాయమాటలు చెప్పి అతడని నమ్మించింది. ఆస్పత్రిలో చేరాను అర్జెంట్‌గా డబ్బు అవసరమని అడిగింది. నిజమని నమ్మిన యువకుడు... ఆమెకు డబ్బు పంపాడు. ఆ తర్వాత... ఏదో ఒక కారణం చెప్పి అతని దగ్గర డబ్బు గుంజుతూనే పోయింది మహిళ. దాదాపుగా 4లక్షల రూపాయలు కాజేసింది. ఆమెపై ప్రేమ పెంచుకున్న యువకుడు... అడిగినప్పుడల్లా డబ్బు అందించాడు.
ఇలా ఏడాది గడిచింది. ఇక, పెళ్లి చేసుకుందామని ఆమెను అడిగాడు యువకుడు. దీంతో అసలు రంగు బయటపెడ్డింది కిలేడీ. అతన్ని దూరం పెడుతూ వచ్చింది. అది గ్రహించిన యువకుడు... వెంటనే పెళ్లి చేసుకుందామని ఆమెపై ఒత్తిడి పెంచాడు. కథ క్లైమాక్స్‌కు రావడంతో... యువకుడి నెంబర్ బ్లాక్‌లో పెట్టేసింది మహిళ. ఎన్ని సార్లు ఫోన్ చేసినా.. ఆమె లైన్‌లోకి రాకపోవడంతో యువకుడికి అనుమానం వచ్చింది. మహిళ గురించి ఆరా తీశారు. ఆమె అసలు పేరు స్వాతి అని... ఆమెకు ఇదివరకే వివాహం అయ్యింది తేలింది. అంతేకాదు ఆమెకు భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్టు కూడా తెలుసుకున్నాడు. ఏంటి ఇదంతా అంటూ మహిళలను నిలదీశాడు. ఎందుకు మోసం చేశావని గట్టిగా ప్రశ్నించాడు. నిజం బయటపడటంతో ప్లేట్ ఫిరాయించింది మహిళ. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అంటూ యువకుడిపై ఎదురుదాడికి దిగింది. దీంతో ఖంగుతిన్న యువకుడు... బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టును కూడా ఆశ్రయించారు.
బాధిత యుకువుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు విచారణ చేశారు. వారి విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. వివాహిత స్వాతి మాత్రమే యువకుడిని మోసం చేయలేదని... ఈ ఛీటింగ్ వెనుక ఆమె భర్త, ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారని తెలుసుకున్నారు. వారి సహకారంతోనే స్వాతి మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. స్వాతి స్నేహితురాళ్లుగా... ఆమె ఇద్దరు కూతుళ్లు కూడా అప్పుడప్పుడు యువకుడితో మాట్లాడినట్టు తెలుసుకున్నారు పోలీసులు. ఆమె కుటుంబం మొత్తం ఈ మోసంలో భాగస్వాములని ప్రాథమిక విచారణలో తేల్చారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.