MRO Asking Bribe: ఓ ఎమ్మార్వో అరాచకం - 8 సార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు, అయినా 25 లక్షలు లంచం డిమాండ్
MRO Asking Bribe: భూమికి పాసు బుక్ ఇవ్వడానికి ఎమ్మార్వో రూ. 25 లక్షలు డిమాండ్ చేస్తుండటంతో ఇప్పటికి ఎనిమిదిసార్లు కలెక్టర్ ను కలిసాడు బాధితుడు. లంచం ఇస్తే తప్ప పని చేయనని వేధిస్తున్నట్లు చెబుతున్నాడు.
MRO Asking Bribe: ప్రభుత్వ అధికారులు అనగానే నిర్లక్ష్యం, అవినీతి గుర్తుకు వస్తాయి. జాబ్ రావడానికి కష్టపడతారు కానీ, కొలువులో చేరాక మాత్రం పని చేయడంలో కొందరు ఉద్యోగులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆ పని చేసేందుకు కొందరు అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వ విభాగం అయినా.. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. అవినీతికి ఆస్కారం లేని చోట నిర్లక్ష్యం తాండవిస్తుంది. అయితే చాలా మంది ప్రభుత్వ అధికారులు తీరు ఇలాగే ఉంటుంది. నేను లంచం తీసుకోను అని బోర్డ్ రాసిపెట్టి, నిజాయితీగా వ్యవహరించిన అధికారులు సైతం ఉన్నారు. కొందరు పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.. తమ డ్యూటీ చేసుందుకు కూడా లంచం అడుగుతారు. అలాంటి ఓ అధికారే ఆ ఎమ్మార్వో.
40 ఎకరాల భూమి కోసమే ఈ తంటా అంతా..
అనంతపురం జిల్లా డి.హీరేహాల్లో 40 ఎకరాల భూమిని పట్టా చేయడానికి ఏకంగా రూ. 25 లక్షల రూపాయలు లంచం అడుగుతున్నాడని బాధితుడు చెబుతున్నారు. ఎమ్మార్వో ఇలా రూ. 25 లక్షలు లంచం అడుగుతున్నారని బాధితుడు కలెక్టర్ వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. స్పందించిన కలెక్టర్.. భూమికి పట్టా చేసివ్వాలని సదరు ఎమ్మార్వోకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ చెప్పిన తర్వాత పని కాకుండా ఉంటుందా అని బాధితుడు సంతోషపడ్డాడు. కలెక్టర్ చెబితే చేయాలా.. రూ. 25 లక్షలు ముట్టిన తర్వాతే పనిచేస్తానని భీష్మించుకు కూర్చున్నాడు ఆ ఎమ్మార్వో. భూమికి పట్టా చేసేది లేదు.. ముందు రూ. 25 లక్షలు కట్టు తర్వాతే పని చేస్తానని తెగేసి చెప్పాడని బాధితుడు తెలిపారు. ఎమ్మార్వో తీరుతో విసిగిపోయిన ఆ బాధితుడు మరోసారి కలెక్టర్ దగ్గరకు వెళ్లి తన ఆవేదన తెలిపాడు.
8 సార్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితుడు..
ఈ సారి కూడా కలెక్టర్ సేమ్ టు సేమ్ ఆదేశాలు ఇచ్చారు. భూమిని పట్టా చేయాలని ఆదేశించారు. చెప్పగానే మారిపోతే తను ఎమ్మార్వో ఎలా అవుతాడు, అది రెవెన్యూ విభాగం ఎందుకు అవుతుంది. కలెక్టర్ రెండో సారి చెప్పినా.. ఎమ్మార్వో కాసింత అయినా దిగి రాలేదు. ఇక లాభం లేదనుకుని మరో సారి కలెక్టర్ వద్దకు వెళ్లాడు బాధితుడు. కలెక్టర్ వద్దకు వెళ్లి కలవడం అంటే మాటలు కాదు. ఆయన అపాయింట్ మెంట్ కావాలంటే ఒక్కోసారి కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. వారి వీరి కాళ్ల మీద పడితే కానీ కొందరికి కలెక్టర్ అపాయింట్మెంట్ దొరకదు. బాధితుడు కలెక్టర్ వద్దకు వెళ్లిన ప్రతి సారీ ఇదంతా దాటుతూ కలెక్టర్ ను కలిసి తన బాధను వెళ్లగక్కేవాడు. అలా ఇప్పటికి 8 సార్లు కలెక్టర్ వద్దకు వెళ్లాడు. అయినా ఎమ్మార్వో మాత్రం తన భూమికి పట్టా చేసి ఇవ్వడం లేదని చెబుతున్నాడు బాధితుడు స్థిరాస్తి వ్యాపారి అయిన వెంకటరమణ.
ఏం చేసినా లంచం తప్పట్లేదు.
ఓ ప్రజాప్రతినిధి అండతో.. ఆ ఎమ్మార్వో లంచం ఇస్తే కానీ పట్టా చేసిచ్చేది లేదని చెబుతున్నట్లు బాధితుడు వెంకటరమణ చెబుతున్నారు. స్థిరాస్తి వ్యాపారి వెంకటరమణ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజవర్గం డి.హీరేహాల్ లో 40 ఎకరాల భూమి కొన్నాడు. పట్టాదారు పాసు పుస్తకం చేయాలని తిరుగుతుంటే రూ. 25 లక్షలు లంచం అడుగుతున్నారని బాధితుడు చెబుతున్నారు. తమకు కలెక్టర్ చెబితే సరిపోదని.. ప్రజాప్రతినిధి చెబితేనే భూమికి పాసు బుక్ బుక్ వస్తుందని రెవెన్యూ అధికారులు నిర్మొహమాటంగా చెప్పేశారని బాధితుడు వెల్లడించారు. డబ్బులు ఇస్తేనే నీ పని చేయాలని ప్రజాప్రతినిధి దగ్గర నుంచి ఆదేశాలున్నాయని.. మండల రెవెన్యూ కార్యాలయం అధికారులు చెప్పినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎనిమిదోసారి ఫిర్యాదు చేయటానికి వెంకటరమణ సోమవారం కలెక్టరేట్ లో జరిగిన స్పందనకు వచ్చారు. కలెక్టర్, జేసీలకు విషయం చెప్పటంతో మరోసారి జేసీ కేతన్ గార్గ్ డీ.హీరేహాల్ రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి చెప్పారు. రెవెన్యూ అధికారులు తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు.